03-08-2025 05:46:05 PM
మందమర్రి,(విజయక్రాంతి): సింగరేణి యాజమాన్యం 2024 - 25 ఆర్థిక సంవత్సరం లో సంస్థ సాధించిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి కార్మికులకు 35% లాభాల వాట చెల్లించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూని యన్ (సిఐటియు) బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు సాంబారు వెంకటస్వామి అల్లి రాజేందర్ లు డిమాండ్ చేశారు. పట్టణం లోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు.
సంస్థ సాధించిన లాభాలను వెంటనే ప్రకటించాలని లేకుంటే సిఐటియు ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామన్నారు. గతంలో తాము గెలిచినప్పుడు జులై నెలలోనే లాభాల వాటా ఇప్పించామని గొప్పలు చెప్పే గుర్తింపు సంఘం ఏఐటియుసి నాయకులు నేటికీ లాభాలను సంస్థ నుండి అధికారికంగా ప్రకటన చేయించలేక వాటా కోరడం వారి చేతకానితనానికి నిదర్శనమని వారు మండి పడ్డారు.గుర్తింపు సంఘంగా గెలిస్తే కార్మిక సమస్యలు పరిష్కరిస్తామని ప్రకటించి గెలిచిన ఏఐటియుసి నాయకులు కార్మికుల్లో నెలకొన్న అసంతృప్తిని గమనించి ఓడిన సంఘాల మాదిరిగా వినతి పత్రాలు ఇస్తు చేతులు దులుపుకుంటు న్నారని విమర్శించారు.
స్ట్రక్చరల్ సమావేశాలలో చర్చించిన వాటిపై సర్కులర్లు ఇప్పించి అమలు చేయించలేని నిస్సహయ స్థితిలో గుర్తింపు సంఘం ఉందని, వేజ్ బోర్డ్ ఒప్పందాలకు కమిటీలు వేసి ఆలస్యం చేస్తున్న గుర్తింపు సంఘం తీరే దీనికి నిదర్శనం అని గుర్తింపు సంఘం తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో లేబర్ కమిషనర్ వద్ద చేసుకున్న 12.3 ఒప్పందాలను అమలు చేయించ లేకపోతున్నారని తాజాగా జరిగిన మెడికల్ బోర్డులో మైనింగ్ స్టాప్ కు సూటబుల్ జాబు ఇప్పించలేక పోయారని, గత 9 నెలలుగా ఫిట్ ఇవ్వకుండా నిలిపి ప్రస్తుతం ఫిట్ ఇవ్వడం సరైనది కాదన్నారు.
నేటికీ బాట బూట్లు, నాణ్యమైన రక్షణ పరికరాలు ఇప్పిస్తామని చెప్తూ కాలం గడుపుతున్నారే తప్ప వాటిని అమలు చేయించలేక పోతున్నారని, దీనిపై కార్మికుల్లో విపరీతమైన అసంతృప్తి ఉన్నదని ఇప్పటికైనా గెలిచిన సంఘం కార్మిక సమస్యలపై దృష్టి సారించాలని వారు హితవు పలికారు. కెకె 5 గనిలో జరిగిన ప్రమాదంలో కార్మికుడు మృతి చెందడం బాధాకరమని సేఫ్టీ కమిటీ, మైన్స్ కమిటీలు అనుభవజ్ఞులచే నడిపించాలని, ప్రస్తుతం ఉన్న కమిటీలు సరిగ్గా పనిచేయక పోవడం మూలంగానే ప్రమాదాలు జరుగుతు న్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా కార్మికులు ప్రశ్నిస్తే వారిని రిలేలు మారుస్తూ మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని, దీంతో డ్యూటీలు చేయలేక నాగాలు పెరుగుతున్నాయని, ప్రీ షిఫ్ట్ లు నడపడంతో షిఫ్ట్ లలో కార్మికుల సంఖ్య తక్కువగా ఉండి కార్మికులపై పని భారం పెరుగుతున్న గుర్తింపు సంఘం పట్టించుకోవడం లేదన్నారు. రాజకీయ జోక్యం వద్దంటూనే రాజకీయ నాయకుల వెంట తిరుగుతున్న గుర్తింపు సంఘం తీరును కార్మికులు గమనించా లని కోరారు.