03-08-2025 12:39:04 AM
నిందితుడి అరెస్టు
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 2 (విజయక్రాంతి): తన సహోద్యోగితో వెళ్తున్న యువతిని అడ్డగించి, వీడియో తీసి వేరే మతం యువకుడితో వెళ్తావా అంటూ ఓ ర్యాపిడో డ్రైవర్ వేధించాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి, రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా తప్పుడు ప్రచారం చేశాడు. రంగంలోకి దిగిన హైదరాబాద్ సెంట్రల్ జోన్ పోలీసులు శనివారం నిందితుడిని అరెస్ట్ చేశారు.
సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి వివరాలను వెల్లడించారు. జూలై 30వ తేదీ తెల్లవారుజామున 3:45 గంటల సమయంలో చింతల నీరజ్ అనే యువకుడు తన సహోద్యోగినితో కలిసి ఎన్టీఆర్ మార్గంలో బైక్‌పై వెళ్తున్నారు. అదే సమయంలో రాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్న మొహమ్మద్ రాహీల్ వారిని అడ్డగించాడు. తన ఫోన్‌లో వీడియో రికార్డింగ్ ఆన్ చేసి, నువ్వు మరో మతం యువకుడితో ఈ సమయంలో వెళ్తావా అంటూ ఆ యువతిని దుర్భాషలాడుతూ బెదిరించాడు.
వారిద్దరూ భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించగా రాహీల్ వారిని వెంబడించాడు. అంతటితో ఆగకుండా, ఓ దశలో తన హెల్మెట్‌తో వారిపై దాడి చేసేందుకు కూడా యత్నించాడు. బాధితులు అతని నుంచి తప్పించుకున్న తర్వాత, నిందితుడు రాహీల్ తాను తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోకు రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా తప్పుడు సమాచారాన్ని జోడించి వైరల్ చేశాడు.
ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితుడు నీరజ్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టి, సాంకేతిక ఆధారాలతో మొహమ్మద్ రాహీల్‌ను అరెస్ట్ చేశారు. ఇలాంటి నైతిక దాడులకు పాల్పడుతూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదని డీసీపీ శిల్పవల్లి ఈ సందర్భంగా తీవ్రంగా హెచ్చరించారు.