calender_icon.png 10 August, 2025 | 10:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇస్రో విజయ పరంపర

01-01-2025 12:00:00 AM

గత కొన్నేళ్లుగా అంతరిక్ష ప్రయోగాల్లో అప్రతిహతంగా దూసుకువెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. కొత్త ఏడాది ప్రారంభానికి రెండు రోజుల ముందే ఇస్రో మరో ఘనత సాధించింది. ‘స్పాడెక్స్’ పేరిట రెండు ఉపగ్రహాలను డాకింగ్, అన్‌డాకింగ్ చేయడానికి చేపట్టిన ప్రయోగం విజయవం తమయింది.

కొద్ది దేశాలకే సొంతమయిన ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టడం ఇదే తొలిసారి. శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌నుంచి ఈ రెండు రాకెట్లను  పీఎస్‌ఎల్‌వీసీ 60 రాకెట్ విజయవంతంగా భూమి కి 470 కిలోమీటర్ల ఎత్తులో నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 20 కిలోమీటర్ల దూరంలో  విడివిడిగా పరిభ్రమిస్తున్న ఈ ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియ జనవరి 7న ప్రారంభమవుతుంది.

ప్రస్తు తం  విడివిడిగా ఉండే ఈ ఉపగ్రహాల్లో ఒకటి క్రమంగా లక్షిత వ్యోమనౌక దిశగా సాగి చివరికి వారం రోజుల తర్వాత దానితో అనుసంధానమవుతుంది. చేజర్, టార్గెట్‌ల మధ్య దూరం మూడు మీటర్లు ఉన్నప్పుడు డాకింగ్ మొదలవు తుంది. ఈ రెండు వ్యోమనౌకల్లో ఒక దాని పేరు ‘టార్గెట్’ కాగా రెండో దాని పేరు ‘చేజర్’. 

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన యువ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ రెండింటి బరువు 440 కిలోలు మాత్రమే.ఈ డాకింగ్, అన్‌డాకింగ్ ప్రయోగం ఇస్రోకు ఎంతో కీలకం. ఎందుకంటే భవిష్యత్తు అంతరిక్ష కార్యక్రమాలు ఈ మిషన్‌పై ఆధారపడి ఉంటాయి.ఈ టెక్నిక్‌ను చంద్రయాన్4 మిషన్‌లో ఉపయోగించడం జరుగుతుంది. అలాగే సొంత అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.

ఇదే కాకుండా ఉపగ్రహ సర్వీసింగ్, ఇంటర్ ప్లానెటరీ మిషన్‌లు, చంద్రుడిపైకి మానవులను పంపడానికి కూడా ఈ సాంకేతికత అవసరం. అంటే ఒకే మిషన్‌ను అనేక దశల్లో చేపట్టినప్పుడుఈ సాంకేతికత అత్యవసరం. ఈ మొత్తం ప్రక్రియను భూమినుండే నియంత్రించడం జరుగుతుంది. కాగా ఈ ప్రయోగం ముందు అనుకున్నదానికన్నా రెండు నిమిషాలు ఆలస్యంగా చేపట్టారు. 

రాత్రి 9.58 గంటలకు ప్రయోగాన్ని చేపట్టాలని భావిం చినా రెండు నిమిషాలు ఆలస్యంగా 10 గంటల 15 సెకన్లకు ప్రయోగం చేపట్టారు. అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ కారణంగా ప్రయోగం రెండు నిమిషాలు ఆలస్యం అయినట్లు ఇస్రో చైర్మన్  డాక్టర్ సోమనాథ్ చెప్పారు.

కాగా ఇది ఇస్రో చేపట్టిన 99వ ప్రయోగం. కొత్త ఏడాది జనవరిలో వందో ప్రయోగం చేపట్టడానికి సిద్ధమవుతున్నట్లు సోమనాథ్ తెలిపారు. జనవరి 7న ఈ రెండు ఉపగ్రహాల డాకింగ్ విజయవంతంగా పూర్తయితే మన దేశం ఈ సాంకేతికత కలిగిన  అమెరికా, రష్యా, చైనాల సరసన నాలుగో దేశంగా నిలుస్తుంది.

కాగా పీఎస్‌ఎల్‌వీ60 ప్రయోగం విజయంలో ఇస్రో సాంకేతిక నైపుణ్యం కీలకపాత్ర పోషించినప్పటికీ అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ లాంటి పలు ప్రైవేటు కంపెనీలు కూడా ఇందులో పాలు పంచుకున్నాయి.తమ సంస్థ లాంచ్ వెహికిల్‌కు పలు ఉపకరణాలతో పాటుగా ఉపగ్రహాలకు అవసరమైన కీలక పరికరాలను కూడా అందించిందని అనంత్ టెక్నాలజీస్ సంస్థ చైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావు చెప్పారు.

హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా పని చేసే ఈ సంస్థ ఇంత ప్రతిష్ఠాత్మక ప్రయోగంలో భాగస్వామి కావడం మన తెలుగువారందరికీ గర్వకారణం. అంతరిక్ష ప్రయోగాల రంగంలో ప్రైవేటు రంగం కూడా పాలు పంచుకోవడం భవిష్యత్తులో ప్రైవేటు భాగస్వామ్యం మరింతగా విస్తరించడానికి దోహదపడుతుంది. 2025లో ఇస్రో మరిన్ని ప్రయోగాలు చేపట్టడానికి సిద్ధమవుతోందని సోమనాథ్ ప్రకటించారు.

  అంతరిక్షరంగంలో వరస విజయాలతో,అలాగే వాణిజ్య రంగంలో కూడా దూసుకెళ్తున్న ఇస్రో రాబోయే రోజుల్లో నాసాలాంటి సంస్థలకు పోటీగా నిలవాలని ఆశిద్దాం.