16-05-2025 12:55:25 AM
-సెలవు దినాల్లో తీగల వంతెనవైపు కన్నెత్తి చూసేవారు లేరు
కరీంనగర్, మే 16 (విజయ క్రాంతి): కరీంనగర్ కు తలమానికంగా నిర్మించిన తీగల వంతెన వైపు నేడు పర్యాటకులు కన్నెత్తి చూడడం లేదు. తీగల వంతెన లైటింగ్ సిస్టమ్ లేకపోవడం, రోడ్లు దెబ్బతినడంతో సాయంత్రం సమయంలో తాకిడి ఎక్కువగా ఉండే ఈ ప్రాంతం బోసిపోయి కనిపిస్తుంది.
తీగల వంతెన ప్రారంభం అనంతరం ఇక్కడ పర్యాటకుల రద్దీని తట్టుకునేందుకు పోలీస్ ఔట్ పోస్టు కూడా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అయితే ఈ వంతెన సంవత్సరం తిరగక ముందే పనికి రాకుండా పోవడంపై పర్యాటకులు విమర్శిస్తున్నారు. కరీంనగర్ పట్టణ శివారులోని మానేరు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి వంతెనపై నాణ్యతలేని పనులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
2023లో ప్రారంభించిన ఈ వంతెన, దాని అప్రోచ్ రోడ్డు కేవలం ఒక సంవత్సరంలోనే అనేకసార్లు దెబ్బతిన్నాయి. గత కొన్ని నెలలుగా వంతెన వద్ద జిల్లా యంత్రాంగం నిర్వహిస్తున్న వారాంతపు కార్యక్రమాలు నిలిపివేశారు. దీనివలన నగరవాసులకు వినోదం లేకుండా పోయింది. అల్గునూరు వంతెనపై తరచుగా వచ్చే ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మించబడిన ఈ కేబుల్ ఆధారిత వంతెన 183 కోట్ల వ్యయంతో నిర్మించబడింది.
కరీంనగర్, వరంగల్, రామగుండం మధ్య వాహనాల రాకపోకలను సులభతరం చేయడానికి, వరంగల్ కు 7 కిలోమీటర్ల దూరాన్ని తగ్గించడానికి ఇది రూపొందించబడింది. గత ప్రభుత్వంలో అప్పటి మంత్రి గంగుల కమలాకర్ తీగల వంతెనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మింపజేశారు. అయితే సంవత్సరం తర్వాత వంతెన రోడ్డు గుంతలమయం కావడం, తీగల వంతెనపై ఏర్పాటు చేసిన లైట్లు వెలగకుండా పోవడంతో క్రమక్రమంగా పర్యాటకుల రద్దీ తగ్గుతూ వచ్చింది.
ప్రస్తుత వేసవి సెలవుల్లో తీగల వంతెన వద్ద ఆహ్లాద వాతావరణాన్ని కల్పిస్తారని అనుకుంటే అది ఎందుకు పనికిరాకుండాపోయే పరిస్థితి ఏర్పడింది. పర్యాటకంగా తీగల వంతెన మరమ్మత్తులు పూర్తిచేసి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అంటుండగా, నాణ్యత లోపం కనిపిస్తుందని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటుండడంతో ఇరు పార్టీల విమర్శల మధ్య తీగల వంతెన నిరుపయోగంగా మారే పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం పట్టించుకునేవారే లేరు
తీగల వంతెన ప్రారంభించిన మొదట్లో ఎంతోమంది పర్యాటకులు ఇక్కడికి వచ్చారు. నిత్యం పర్యటకులతోనే ఇక్కడి ప్రాంతం కలకలాడింది. రాత్రి వేళలో కనువిందు చేసే మ్యూజికల్ లైటింగ్ సిస్టం ఎంతోమందిని ఆకట్టుకుంది. ప్రస్తుతం తీగల వంతెన ను పట్టించుకునేవారు లేకుండా పోయారు. రాత్రివేళ ఇక్కడి ప్రాంతం లో అంధకారం రాజ్యమేలుతుంది. పర్యాటకులను ఆకట్టుకున్న తీగల వంతెన నేడు బోసిపోయే పరిస్థితి వచ్చింది. మళ్లీ తీగల వంతెనకు పూర్వవైభవం తెచ్చేలా, పర్యాటకలను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం-
కళ్యాణ్ , బీజేపీ నాయకులు