calender_icon.png 17 May, 2025 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో లైసెన్స్‌డ్ సర్వేయర్లు!

16-05-2025 12:53:58 AM

  1. కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ నియామకం 
  2. ఈనెల 17వరకు సర్వేయర్ల నియామకాలకు దరఖాస్తులు
  3. భూవిస్తీర్ణాన్ని బట్టి సర్వేయర్లను నియమించాలి 
  4. గ్రామీణప్రాంతాల్లో పెరుగనున్న ఉపాధి అవకాశాలు
  5. భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కృషి  
  6. రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి  

హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు, భూలావాదేవీలను సమర్థవంతంగా నిర్వహించడానికి పకడ్బందీ గా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కర్ణాటకలో విజయవంతమైన లైసెన్స్‌డ్ సర్వేయర్ విధానాన్ని తెలంగాణలో అమలు చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు.

అందులో భాగంగానే 5వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను తీసుకోబోతున్నామని, ఇందుకోసం ఈ నెల17 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు గురువారం ఒక ప్రకనటలో మంత్రి పేర్కొన్నారు.  కర్ణాటకలో అమలవుతున్న లైసెన్స్‌డ్ సర్వేవిధానంపై ఇటీవలనే సర్వే విభాగానికి సంబంధించిన ఇద్దరు అధికారులు అధ్యయనం చేసి నివేదిక ఇచ్చారని, ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు.

తెలంగాణలో శాశ్వతంగా భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని పేర్కొన్నారు.  భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియకు భూమి సర్వే మ్యాప్‌ను జతపర్చడం తప్పనిసరి చేసిన  నేపథ్యంలో ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ విధానం అమలయ్యేందుకు చర్యలు తీసుకోవాలని ఆదికారులను మంత్రి ఆదేశించారు.

రాష్ట్రంలోని ఆయా మండలాల్లో భూలావాదేవీ లు, భూవిస్తీర్ణాన్ని బట్టి సర్వేయర్లను నియమించాలన్నారు. కర్ణాటకలో దాదాపు 20 ఏళ్ల క్రితం నియమి తులైన సర్వేయర్లు కొనసాగుతున్నారని, ఇక్కడ కూడా అదే విధానం అవలంబించడం ద్వారా గ్రామీణప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. 

కర్ణాటకలో 6వేల లైసెన్స్‌డ్, 4వేల మంది ప్రభుత్వ సర్వేయర్లు.. 

కర్ణాటక ప్రభుత్వం లైసెన్స్‌డ్ సర్వేయర్ పథకం 1999 సంవత్సరంలో  కర్ణాటక  ల్యాండ్ రెవె న్యూ చట్టంలో చేసిన సవరణలతో ప్రారంభమైందని, 2005  నుంచి అమల్లోకి వచ్చిందని మంత్రికి సంబంధిత అధికారులు అంతకు ముందు వివరించారు.

ఈపథకం ద్వారా భూ ముల రిజిస్ట్రేషన్‌కు ముందు మ్యూటేషన్ స్కెచ్ (పీఎంఎస్) తయారు చేయబడుతుందని, ప్రీ రిజిస్ట్రేషన్ స్కెచ్‌తో కొనుగోలు చేయబోయే భూమి విస్తీర్ణం, టైటిల్, భూసరిహద్దు వివరాలు స్పష్టంగా ఉంటా యని అధికారులు తెలిపారు.

కర్ణాటకలో ప్రస్తుతం 6వేల మంది లైసెన్స్‌డ్  సర్వేయర్లు, 4 వేల మంది ప్రభుత్వ సర్వేయర్లు సేవలందిస్తున్నారని, ఒక్కో లైసెన్స్‌డ్ సర్వేయర్‌కు నెలకు సగటున 23 దరఖాస్తులు వస్తాయని, దీంతో అతడికి నెలకు రూ.25వేల నుంచి రూ.30వేల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు.

లైసెన్స్‌డ్ సర్వేయర్లు నిర్వహించి, రిజిస్ట్రేషన్‌కు ముందు స్కెచ్ తయారు చేసి పోర్టల్లో అప్‌లోడ్ చేస్తారని, వీరి పనులను ప్రభుత్వ సర్వేయర్లు పరిశీలించి సంబంధిత అధికారి ఆమోదిస్తారని తెలిపారు. ఈ పథకం ద్వారా భూలావాదేవీలు మరింత సమర్థవంతంగా, శాస్త్రీయంగా సాగుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు.