కూల్చివేతలన్నీ హైడ్రాకు ఆపాదించడం తగదు
- హైకోర్టు ఆదేశాల మేరకు ఫుట్పాత్ల ఆక్రమణలను తొలగిస్తున్న కార్పొరేషన్లు
- సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని ఖండించిన హైడ్రా
సికింద్రాబాద్,ఏప్రిల్ 26 (విజయక్రాంతి): ఎక్కడ కూల్చివేతలు జరిగినా హైడ్రా చేసినట్టు చూపించి.. దుష్ప్రచారం చేయడాన్ని హైడ్రా ఖండించింది.ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్రతినిధులు గుర్తించాలని హైడ్రా కోరింది. అవగాహన లేకుండా సోషల్ మీడియా ప్రసారం చేస్తున్న వార్తలు,వీడియోలను,కబ్జాలు, ఆక్రమణలకు పాల్పడుతున్నవారు హైడ్రాపై దుష్ప్రాచారానికి వాడుతున్నారు. ఓ పద్ధతి ప్రకారం హైడ్రాపై దుష్ప్రచారం చేస్తున్నారు.
నగరంలో ఫుట్ పాత్ల ఆక్రమణలను హైడ్రా తొలగించడంలేదు.హైకోర్టు ఆదేశాల మేరకు నగరంలో ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపును మూడు మున్సిపల్ (జీహెచ్ ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ) కార్పొరేషన్లు పెద్దయెత్తున చేపట్టాయి. ఈ క్రమంలోనే పాతబ స్తీతో పాటు,నగరంలో అనేక ప్రాంతాల్లో ఫుట్పాత్ల ఆక్రమణలను ఆయా మున్సిపల్ కార్పొరేషన్లు తొలగిస్తున్నాయి. ఈ విషయాన్ని అందరూ గ్రహించాలని హైడ్రా సూచించింది. హైడ్రా భారీ ఆపరేషన్లు చేస్తుంది.
బడాబాబులు,కబ్జాదారుల ఆటకట్టించి వారి ఆక్రమణలను హైడ్రా తొలగి స్తుంది. ఇలా వందలు, వేల ఎకరాల ప్రభుత్వ భూముల(ప్రజల ఆస్తిని)ను హైడ్రా కాపాడింది. చెరువులు, నాలాలు, రహదారులు, పార్కుల ఆక్రమణల తొలగింపును హైడ్రా చేపడుతుంది.
రెవెన్యూ అధికారుల అభ్యర్థన మేరకు ప్రభుత్వ భూముల ఆక్రమణలను హైడ్రా తొలగిస్తుంది. నగరంలో గొలుసు కట్టు చెరువులను పునరుద్ధరించే పనిలో హైడ్రా నిమగ్నమై ఉంది. వర్షాకాలం వరదల కట్టడి చేయడమే లక్ష్యంగా హైడ్రా పని చేస్తోంది. పర్యావరణ హితమైన నగర నిర్మాణం ప్రభుత్వ లక్ష్యం.ఆ దిశగా హైడ్రా పని చేస్తోంది.






