09-07-2025 12:16:48 AM
బీఆర్‌ఎస్ ఆగడాలను చూస్తూ ఊరుకోం..
రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
మనోహరాబాద్, జులై 9 : నిజాలను వెల్లడించే మీడియా చానళ్లపై దాడి చేస్తానని బీఆర్‌ఎస్ నాయకుల హెచ్చరించడం హేయమైన చర్యని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దుయ్యబట్టారు. దాడులకు పాల్పడితే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని, దమ్ముంటే ముందు మా నాయకులపై దాడి చేయాలన్నారు.
మంగళవారం మనోహరాబాద్ మాజీ సర్పంచ్ చిట్కుల్ మహిపాల్రెడ్డి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొని అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్ నాయకుల గుట్టు రట్టు చేస్తున్న ఓ ఛాన్ప దాడి చేస్తామని హెచ్చరించడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మీడియా వ్యవస్థను వాడుకొని ఇప్పుడు మాత్రం మీడియా చానళ్లపై దాడులు చేస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
తెలంగాణ విద్యార్థుల బలిదానాల త్యాగం తెలంగాణ రాష్ట్రం అని, వారి ద్వారా లభించిన తెలంగాణను మీరే కైవసం చేసుకుని వారి శవాల మీద పదేళ్ళు రాజ్యమేలారని ఆయన దుయ్యబట్టారు. పదేళ్ళు రాష్ట్రాన్ని దోచుకున్నది కాకుండా రాష్ట్రంలోని ఫోన్ టాపింగ్ కేసుల్లో మీ బాగోతం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్, గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి, కాంగ్రెస్ యువ నాయకులు మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.