3 July, 2026 | 2:12 AM

చర్చలకు పిలిచి అరెస్టులు చేయడం సిగ్గుచేటు

03-07-2026 12:04 AM
  1. ఎమ్మెల్యే ముఠా గోపాల్
  2. విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ

ముషీరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): టెండర్లలో అవినీతి జరిగింది కాబట్టే చర్చలకు భయపడి బీఆర్‌ఎస్ అగ్రనాయకులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ విమర్శించారు. గురువారం ముషీరాబాద్ లోని రెండు స్కూళ్లలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు టి. సోమన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్టేషనరీ సామాగ్రిని పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి వారికి కావల్సిన అవసరాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన టెండర్లలో అవినీతికి ఆస్కారం లేకుంటే చర్చలకు మంత్రులకు ఎందుకింత భయమ ని ప్రశ్నించారు. గన్ పార్కులోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు రమ్మని సవా ల్ విసిరి పోలీసులచే బీఆర్‌ఎస్ నేతలను అరెస్టు చేయించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఏమి విషయం లేదు కాబట్టే మంత్రి జూపల్లి తెలంగాణ భవనానికి చర్చలకు రాకుండా మొఖం చాటేశారని పేర్కొన్నారు.

ప్రజలు కాంగ్రెస్ నాయకుల అవినీతి అక్రమాలను గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అనంతరం ఎంసీహెచ్ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని టి. సోమన్ తో కలిసి ఎంసీహెచ్ కాలనీ వాసులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు పి. శ్రీధర్ చారి, ఎంసీహెచ్ కాలనీ అధ్యక్షుడు సునిల్, డి. రాజు, బల్వంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.