1 April, 2026 | 2:34 AM

ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడం డ్రైవర్ బాధ్యత

01-04-2026 12:05 AM

జిల్లా ఎస్పీ కె నరసింహ 

సూర్యాపేట, మార్చి 31 (విజయక్రాంతి) : ప్రయాణికులను సురక్షిత గమ్యం చేర్చడం డ్రైవర్ బాధ్యత అని జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా మంగళవారం సూర్యాపేట ట్రాఫిక్, పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రజలకు, ఆటో, టాక్సీ డ్రైవర్లకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డ్రైవర్‌లు తప్పక రహదారి నియమాలు పాటిస్తూ ప్రతి ప్రయాణంలో ప్రయాణికులను చేర్చాలన్నారు.

వాహనాలు నడుపుతున్న సమయంలో రోడ్డుపై ఉన్న పరిస్థితులను అంచనా వేస్తూ, కాలినడకన వెల్లు వారిని గమనిస్తూ  ముందుకు సాగాలన్నారు.  టాక్సీ, ఆటో డ్రైవర్లు చక్కని యూనిఫామ్ ధరించాలని, వాహనానికి సంబంధించి అన్ని అనుమతి పత్రాలు కలిగి ఉండాలన్నారు.  ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ట్రాఫిక్ ఎస్‌ఐ సాయిరాం, పట్టణ ఎస్‌ఐ లు ఏడుకొండలు, ఐలయ్య,  స్థానిక పౌరులు ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు పాల్గొన్నారు.