పలు జిల్లాల్లో అకాల వర్షం
- వందల ఎకరాల్లో పంట నష్టం
- నేలరాలిన మామిడి కాయలు
- విరిగిపడిన వృక్షాలు
- నిలిచిన విద్యుత్ సరఫరా
నిర్మల్, మార్చి 31 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం రాత్రి జోరు వాన కురిసింది. నిర్మల్ జిల్లాలో సోమవారం రాత్రి కుబేర్, తానూర్, కుంటాల, భైంసా, ముధోల్, లోకేశ్వరం, సోను సారంగాపూర్, లక్ష్మణ చందా మండలాల్లో సుమారు గంటసేపు వర్షం కురిసింది. దీంతో మొక్కజొన్న, జొన్న, పొద్దు తిరుగుడు, నువ్వు పంటలు నేలకొరిగాయి. రైతులు ఆరబోసిన మొక్కజొన్న, పసుపు, మిర్చి పంటలు తడిసిపోయాయి.
అర్ధరాత్రి కావడంతో రైతులు పంటను కాపాడుకునేందుకు చిమ్మ చీకట్లో పడరాని పాట్లుపడ్డారు. మామిడికాయలు నేల రాయడంతో రైతులకు తీవ్ర నష్టం కలిగింది. కుంటాల, కుబీర్, బైంసాలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. భైంసా పట్టణంలో చెట్లు విరిగి ఇండ్లపై, వాహనాలపై పడ్డాయి.
వరంగల్ జిల్లాలో
మహబూబాబాద్ (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోమవారం రాత్రి పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్, కాటారం, జనగామ జిల్లాలో పలుచోట్ల మామిడి కాయలు నేల రాలాయి. మొక్కజొన్న పైర్లు పడిపోయాయి. జనగామ మార్కెట్లో విక్రయానికి తెచ్చిన మక్కలు తడిసిపోయాయి. అకాల వర్షాలు, ఈదురు గాలులు చేతి కంద వచ్చిన పంటలను దెబ్బతీశాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. జనగామలో 11.03, మహాదేవపూర్ లో 13.02, కాటారంలో 2.04 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
ఆదిలాబాద్ జిల్లాలో
ఆదిలాబాద్/ఉట్నూర్(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా తాంసి, తలమడుగు, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో సోమవారం రాత్రి కురిసిన వడగండ్ల వానతో పంటలు నష్టపోయయి. లక్ష్మణచంద మండలంలో 335 ఎకరాల నువ్వు పంటనష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారి వసంత్‌రావు తెలిపారు.
కరీంనగర్ జిల్లాలో
హుజురాబాద్/కోరుట్ల(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండల వ్యాప్తంగా సోమవారం రాత్రి గాలిదుమారం బీభత్సం సృష్టించింది. కంకి దశలో ఉన్న మొక్కజొన్న పంట తీవ్రమైన గాలుల దాటికి నేలకూలింది. చేతికొచ్చిన పంటను ప్రకృతి విపత్తు పగబట్టడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాలు ఈదురు గాలుల దాటికి వరి మొక్కజొన్న మామిడి పంటలు మొత్తం నేలకొరిగాయి. వ్యవసాయ మార్కెట్లో సుమారు 400 క్వింటాళ్ల మొక్కజొన్న ధాన్యం తడిసి ముద్దయ్యింది.




