12 April, 2026 | 3:19 AM

పొలిటికల్ బెట్టింగ్స్!

13-05-2024 01:18 AM

పార్టీలు, అభ్యర్థుల గెలుపోటములపై భారీగా పందేలు

ప్రముఖ నేతల మెజారిటీలపైనా బెట్టింగులు

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఏపీలోనూ క్రేజ్

పట్టణాల నుంచి గ్రామాలకూ పాకిన సంస్కృతి

హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12 (విజయక్రాంతి): తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయనేది ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికకు ఈ రోజు పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. అయితే ఈ ఫలితాలపై ముందే బెట్టింగ్ బాబులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మెజార్టీ స్థానాలను ఏ పార్టీ గెలుచుకుంటుంది? ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది? అన్న దానిపై బెట్టింగులు జోరందుకున్నాయి.

ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలలోని ప్రముఖ నాయకులు బరిలో నిలిచే స్థానాల్లో గెలుపోటములపై బెట్టింగ్ బాబులు భారీగా పందేలు కాస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు క్రికెట్ వరల్డ్ కప్, ఐపీఎల్, ఇతరత్రా పోటీలపై బెట్టింగులు నిర్వహించిన బెట్టింగ్ గ్యాంగులు.. ఇప్పడు తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలపై కన్నేసినట్లు తెలుస్తోంది. 17 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలుస్తాయి? ఎన్ని సీట్లతో సరిపెట్టుకుంటాయి? ఏ అభ్యర్థి ఎంత మెజార్టీతో గెలుస్తాడు? అంటూ బెట్టింగ్‌లు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

మెజార్టీపైనా పందేలు...

అభ్యర్థుల గెలుపోటములతోపాటు మెజార్టీ ఎంత వస్తుందని కూడా పందేలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్, కరీంనగర్, మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, చేవెళ్ల, మెదక్ వంటి నియోజకవర్గాలపై బెట్టింగ్ గ్యాంగులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక విజయావకాశాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులకు మెజారిటీ ఎంతొస్తుందనే దానిపై పందెంరాయుళ్లు బెట్టింగులకు దిగుతున్నారు. అగ్రనాయకులు పోటీచేస్తున్న స్థానాలపై రూ.లక్షల నుంచి రూ.కోట్లల్లో బెట్టింగులు కాస్తున్నారనే ప్రచారం పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా జరుగుతోంది. ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా కొన్ని సంస్థలు ఆన్‌లైన్‌లోనూ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బెట్టింగ్ బాగోతం పట్టణాల నుంచి పల్లెలకూ పాకింది. వారు అభిమానించే నాయకులపైన బెట్టింగులు రూ.వేలు నుంచి రూ.లక్షల్లో కాస్తున్నారు.

ఇక్కడి ఫలితాలపై ఏపీలోనూ పందేలు

రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ఫలితాలపై ఏపీలోనూ బెట్టింగులు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈసారి ఏపీలో ఎవరొస్తారనే దానిపై తెలంగాణలోనూ పందేలు కాస్తున్నారు. ఇలా కోట్ల్లల్లో రూపాయలు చేతులు మారుతున్నాయి. ఉత్కంఠను అనుకూలంగా మార్చుకొని హాట్ సీట్లపై జోరుగా పందేలు కాస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఏపీ కేంద్రంగా ఈ పందేలు సాగుతుండటం గమనార్హం. గుట్టుచప్పుడు కాకుండా రూ.కోట్లలో ఈ బెట్టింగ్ తంతు సాగిపోతోంది.

ఏపీలో కోడి పందెల్లో విచ్చలవిడిగా బెట్టింగులు కాసే పందెంరాయుళ్లు ఇప్పుడు తెలంగాణలోని ఎన్నికల ఫలితాలపైనా బెట్టింగ్‌లు పెడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలప్పుడూ రూ.వందల కోట్లల్లో చేతులు మారినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు బెట్టింగ్ గ్యాంగులు భారీగా రంగంలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు బెట్టింగ్‌లపై పోలీసు యంత్రాంగమూ అప్రమత్తమవుతోంది. బెట్టింగ్‌కు పాల్పడే వారిపై ఫోకస్ పెడుతోంది. ఎన్నికల ముందే భారీగా పందేలు జరగుతుండగా ఎగ్జిట్‌పోల్స్ వచ్చాక మరింత ఊపందుకోనున్నాయి.