21-09-2025 01:08:19 AM
రాష్ట్రప్రభుత్వ నెలవారీ ఆదాయం రూ.12 వేల కోట్లు
ఉద్యోగుల జీతభత్యాలు, మిత్తిలకే రూ.11 వేల కోట్లు చెల్లింపులు
హైదరాబాద్, సెప్టెంబర్ 20(విజయక్రాంతి): తెలంగాణ సిద్ధించిన మొదట్లో మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రం.. పదేళ్ల తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. గత ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా తీసుకువచ్చిన అప్పులు, వాటి పై వడ్డీల భారం రాష్ట్రఆర్థిక వ్యవస్థ గాడి తప్పేలా చేస్తున్నది. ప్రభుత్వానికి నెలనెలా వచ్చే ఆదాయం ఉద్యోగుల జీతభత్యాలు, అప్పులకు మిత్తిల చెల్లింపులకు సరిపోతుండగా, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రతి నెలా వేల కోట్ల ఆదా యం ఉన్నప్పటికీ రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న ఆర్థిక అవసరాలు తీర్చడానికి మాత్రం ఆ ఆదాయం సరిపోవడం లేదు. ప్రభుత్వ పరిపాలన, జీతభత్యాలతోపాటు సంక్షేమ పథకాల అమలు, అన్నింటికీ మించి ఇప్పటివరకు చేసిన అప్పులకు సంబంధించిన మిత్తిలు చెల్లింపులకు కొత్తగా అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆదాయానికి మించిన అవసరాలు..
రాష్ట్రానికి వివిధ వనరుల ద్వారా నెలనెలా స్థిరమైన ఆదాయం వస్తు న్నప్పటికీ, ఆ మొత్తం సరిపోవడం లేదు. సర్కార్‌కు నెలకు రూ.12 వేల కోట్ల రాబడి ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. ఈ ఆదాయంలో రూ.5 వేల కోట్ల మేర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకు వెళ్తుంది. రాష్ట్ర అప్పులకు సంబంధించిన మిత్తి కింద సుమారు మరో రూ.6 వేల కోట్లు వెళ్తుంది. అంటే.. రూ.11 వేల కోట్ల నిధులు కేవలం వేతనాలు, మిత్తిలకే సరిపోతుందన్నమాట. ఇవికాక, రెగ్యులర్ మానిటరింగ్‌కు సంబంధించిన బిల్లుల చెల్లింపులు సైతం నెలవారీ ఆదా యం నుంచే వెళ్తుందని తెలిసింది. ఇక పథకాలు, ఇతర బకాయిల చెల్లింపులకు కొత్తగా అప్పు చేయాల్సిన పరిస్థితి.
రూ.35 వేల కోట్లు సమకూర్చుకునేందుకు..
నెలనెలా వచ్చిన ఆదాయం.. వ చ్చింది వచ్చినట్లే ఖర్చవుతుండడంతో రాష్ట్రప్రభుత్వం సతమతమవుతున్నది. ఉద్యోగుల వేతనాలు, అప్పులకు మిత్తిలకు సరిపోతున్నది. సంక్షేమ పథకాల అమలుకు మళ్లీ కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఇప్పటికే భుజానికెత్తుకున్న అభివృద్ధి పనులకు సైతం భారీగా నిధులు అవసరం.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ద్వారా రూ.30 వేల కోట్ల నుంచి రూ.35 వేల కోట్ల మేర సమకూర్చుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నెలలో ఆర్బీఐ నుంచి సర్కార్ రూ. వెయ్యి కోట్ల రుణం తీసుకుంటుందని సమాచారం. అలాగే మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు రూ.4 వేల కోట్లు, యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణానికి రూ.21 వేల కోట్లు, ఇతర అవ సరాలకు రూ.900 కోట్ల మేర నిధులు సమకూర్చుకోవాలని సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.