calender_icon.png 21 September, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టార్గెట్ ఇండియా! ట్రంప్ వీసా బాంబ్

21-09-2025 01:41:42 AM

హెచ్-1 బీ వీసా రుసుం లక్ష డాలర్లకు పెంపు 

వీసా రుసుం పెంపునకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉత్తర్వులు

  1. నేటి నుంచే అమల్లోకి.. 
  2. కొత్త దరఖాస్తుదారులకే వర్తింపు 
  3. అగ్రరాజ్యానికి పరుగులు పెడుతున్న టెకీలు 
  4. టికెట్ ధరలు రెట్టింపు చేసిన విమానయాన సంస్థలు 
  5. అమెరికాలో పనిచేస్తున్న భారతీయులపై అధిక ప్రభావం: నాస్కామ్ 
  6. లోతుగా విశ్లేషిస్తున్నాం: భారత విదేశాంగ శాఖ 

వాషింగ్టన్, సెప్టెంబర్ 20: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. డాలర్ కలలు కనే టెకీల ఆశలపై నీళ్లు చల్లుతూ.. హెచ్-1బీ వీసా రుసుమును భారీగా పెంచేశారు. ప్రస్తుతం 2000-5000 డాలర్లుగా ఉన్న హెచ్-1బీ వీసా ఫీజును లక్ష అమెరికన్ డాలర్ల (సుమారు రూ. 88 లక్షలు) కు పెంచారు. ఈ ధరలు ఆదివారం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై కూడా సంతకం చేశారు.

ఇప్పటికే భారత్‌పై అదనపు సుంకాలు విధించిన ట్రంప్, ప్రస్తుతం భారతీయ యువత కలలను కూడా చిదిమేస్తూ వీసా ఫీజును భరించలేనంత పెంచేశారు. ట్రంప్ నిర్ణయంతో అమెరికాలో ఉద్యోగం చేస్తూ.. ప్రస్తుతం భారత్‌లో ఉన్న టెకీలు ఉన్న ఫళంగా అగ్రరాజ్యానికి పరుగులు పెడుతున్నారు. అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ మాట్లాడుతూ.. ‘ఒక్కో హెచ్-1బీ వీసా కోసం కంపెనీలు ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాలి.

పెద్ద కంపెనీలతో ఇప్పటికే ఈ విషయంపై చర్చించాం. మీరు విదేశీయులకు శిక్షణ ఇచ్చే బదులు అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీల నుంచి డిగ్రీ పట్టా పొందిన స్థానిక యువతకు శిక్షణనివ్వండి. ఇకపై హెచ్-1బీ వీసాలపై ట్రైనీలను నియమించుకునేందుకు అవకాశం లేదు. అమెరికన్ల ఉద్యోగాలు బయటి వ్యక్తులకు ఇవ్వడం ఆపేయండి’ అని అన్నారు. అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. ‘సాంకేతిక రంగం ఈ మార్పునకు మద్దతునిస్తుంది.

ఈ కొత్త వీసా రుసుముతో వారు సంతోషంగా ఉంటారు’ అని పేర్కొన్నారు. అమెజాన్, ఆపిల్, గూగుల్, మెటా వంటి పెద్ద కంపెనీల ప్రతినిధులు ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించలేదు. హెచ్-1బీ వీసా వ్యవస్థ ఎక్కువగా దుర్వినియోగం అవుతోందని వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీ విల్ షార్ప్ ఆరోపించారు. కాగా అమెరికా నిర్ణయం భారత టెక్ కంపెనీలపై ప్రభావం చూపిస్తుందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) ఆందోళన వ్యక్తం చేసింది.

ఇక భారత్‌కు బలహీన ప్రధాని ఉన్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఇక పెరిగిన హెచ్-1బీ వీసా ఫీజుల మీద భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. లోతుగా అధ్యయనం చేస్తున్నట్టు పేర్కొంది. ఈ వీసా ఫీజు పెంపు వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు 100 బిలియన్ డాలర్ల మేర ఆదాయం సమకూరనున్నట్టు వాణిజ్య కార్యదర్శి లుట్నిక్ తెలిపారు. ఈ ఆదాయంతో అమెరికా అప్పులు తీరుస్తామని అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు.  

1990 నుంచే.. 

హెచ్‌బౌ వీసా విధానాన్ని అమెరికా ప్రభుత్వం 1990లో ప్రవేశపెట్టింది. అత్యంత ప్రతిభ ఉన్న విదేశీ కార్మికుల కోసం అమెరికన్ ప్రభుత్వం ఈ కొత్త విధానం ప్రవేశపెట్టింది. అమెరికాలో ఉన్న టెక్నాలజీ కంపెనీలు పెద్ద ఎత్తున ఈ వీసాలు మంజూరు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా భారతీయులే ఈ వీసాలను పొందుతున్నారు.

ప్రతి సంవత్సరం లాటరీ పద్ధతిలో 85 వేల హెచ్-1బీ వీసాలను జారీ చేస్తారు. ఇలా జారీ అయిన వీసాల్లో 71 శాతం భారతీయులకే దక్కుతుండగా.. 11.7 శాతం చైనీయులు దక్కించుకుంటున్నారు. హెచ్‌త వీసాలను మూడు, ఆరు సంవత్సరాల కాలపరిమితుల్లో జారీ చేస్తారు. అమెజాన్ కంపెనీ 10 వేల అప్రూవల్స్ పొందుతుండగా.. టీసీఎస్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్ కంపెనీలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 

వివరాలు విశ్లేషిస్తున్నాం.. 

‘హెచ్-1బీ వీసా రుసుము ఆదేశాలకు సంబంధించిన వివరాలను విశ్లేషిస్తున్నాం. ఈ ధోరణి అమెరికా ఆవిష్కరణల వ్యవస్థతో పాటు ఉద్యోగాలపై కూడా ప్రభావం చూపిస్తుంది’ అని నాస్కామ్ వెల్లడించింది. ‘అమెరికా హెచ్-1బీ వీసా పెంపుకు సంబం ధించిన నివేదికలను ప్రభుత్వం చూసింది. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలను అధ్యయనం చేస్తున్నారు. ఈ నిర్ణయం ఇరు దేశాల్లోని వ్యక్తులు సంస్థలను ప్రభావితం చేసే అంశం. అగ్రరా జ్యం నిర్ణయం తో ఎన్నో కుటుంబాలకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ ఇబ్బందులను అమెరికా అధికారులు తగినరీతిలో పరిష్కరి స్తారని ఆశిస్తున్నాం’ అని విదేశాంగశాఖ ప్రకటనలో తెలిపింది. 

కొత్తవారికే.. 

అమెరికా పెంచిన కొత్త వీసా ఫీజులు కేవలం కొత్త వారికే అని ట్రంప్ కార్యవర్గం క్లారిటీనిచ్చింది. ‘దేశంలో ఉంటున్న వారు లేదా అమెరికాలో పని చేస్తూ భారత్‌కు వె ళ్లినవారు లక్ష డాలర్లు కట్టాల్సిన అవసరం లేదు. ఆదరాబాదరాగా ఆదివారం లోపు రావాల్సిన అవసరం లేదు. లక్ష డాలర్ల ఫీ జు అనేది కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి మాత్రమే. ఇది వరకే వీసా ఉన్న వారికి కా దు’ అని ట్రంప్ కార్యవర్గంలోని సీనియర్ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. 


భారత్‌కు బలహీన ప్రధాని

మళ్లీ పునరావృతం చేస్తున్నా. భారత్‌కు బలహీన ప్రధాని ఉన్నారు.

 కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 

బర్త్ డే కాల్ తర్వాత 

ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్న రిటర్న్ గిఫ్ట్‌తో భారతీయులు బాధపడ్డారు.

 కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే