calender_icon.png 21 September, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ పూల పండుగ

21-09-2025 01:25:26 AM

ఉద్యమ పురిటిగడ్డగా దేశంలో తనకంటూ ఓ చరిత్రను లిఖించిన తెలంగాణ ప్రస్థానంలో బతుకమ్మ పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రకృతిని దైవంగా భావించే స్వచ్ఛమైన తెలంగాణ ఆడపడచుల బతుకు చిత్రమే బతుకమ్మ. ఉవ్వెత్తున ఎగిసిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ బతుకమ్మ పోషించిన పాత్ర మరువలేనిది. స్వచ్ఛమైన మనసులతో ప్రకృతిలో మమేకమైన పూల పండుగకు వేళయ్యింది. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మ ఉత్సవాల ప్రత్యేకతలను తెలుపుతూ విజయక్రాంతి ప్రత్యేక కథనం.

మహిళల ఆత్మవిశ్వాసానికి, ప్రకృతితో కలిసిపోయే జీవన విధానానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ఆదివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే సంస్కృతిక పరవశం తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగనుంది. బతుకమ్మ పండుగ ఒక సంస్కృతి, ఒక జీవన విధానం, తెలంగాణ సప్పుడుగా ప్రతి గుండెల్లో గర్వాన్ని నింపే పుష్పార్చన బతుకమ్మ. బతుకమ్మ పండగలో పూల తోరణం సంస్కృతికి సజీవ ప్రతీక.

ఈ పండుగలో మహిళలు వివిధ రంగుల దుస్తులు ధరించి తేనె పలుకులతో కురిపించే ఆటపాటలతో భూమాతకు కృతజ్ఞతలు తెలుపుతారు. గులాబీలు, గన్నేరు, తంగేడు పూలతో సహా అనేక వెన్నెల పూలతో తయారు చేసే బతుకమ్మలు ప్రకృతి అందాన్ని ప్రతిబింబిస్తాయి. బతుకమ్మ పండుగలో తెలంగాణ మహిళల శ్రామిక జీవితం, కుటుంబ బాంధవ్యాలు, సమాజం పట్ల ప్రేమ అన్నింటినీ చూసుకోవచ్చు.

సమూహంగా ఆడే ఆటలు పాటలు సామూహిక చైతన్యానికి సంకేతాలుగా నిలుస్తాయి. పల్లె పొరగుల గుండెల్లో గర్వంతో మురిసే విధంగా బతుకమ్మ అంకురార్పణగా నిలుస్తుంది. బతుకమ్మ పండుగ పూల వినియోగం ఆ కాలపు పంటల కృతజ్ఞత, వివిధ రకాల ఆహార పదార్థాలతో ఆరోగ్యకరమైన జీవనశైలికి సూచనగా నిలుస్తుంది. ఇది పండగే కాదు ఒక జీవన మార్గదర్శి. తెలంగాణ సమాజంలో మహిళల అద్భుత పాత్రకు ఇది ఒక సంస్కృతిక ఆధార శిలగా నిలుస్తుంది.

సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను అధికారికంగా ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా బతుకమ్మ పండుగ గొప్పదనాన్ని పరిచయం చేస్తోంది. తొమ్మిది రోజులపాటు తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాల మేలవింపుతో నిర్వహించే బతుకమ్మ వేడుకలు మహాలయ అమావాస్య నుంచి మొదలై సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈ పండుగ ప్రకృతి దేవత గౌరీ ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుంది. 

ఒకటో రోజు: ఎంగిలిపూల బతుకమ్మ 

మహాలయ అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. పండగ ప్రారంభం రోజు మహిళలు చిన్న బతుకమ్మలను తయారుచేసి నువ్వులు, బియ్యం పిండి ముద్దలు నైవేద్యంగా సమర్పిస్తారు. కొందరు ఇండ్లలో, మరికొందరు సమీపంలోని దేవాలయాల వద్దకు వెళ్లి గౌరీదేవి (అన్నపూర్ణ)ను ప్రార్థించి, సామూహికంగా ఆటపాటలతో కొలుస్తారు. అన్నపూర్ణ దేవిని స్మరించడం వల్ల మిగిలిన పదార్థాలను అర్పించడం ద్వారా అన్నపూర్ణ తత్వాన్ని స్మరిస్తారు. అన్నం ఎప్పుడూ వృథా కాకూడదనేది ఎంగిలిపూల బతుకమ్మ వేడుక ప్రాశస్త్యం.

రెండో రోజు అటుకుల బతుకమ్మ

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు అటుకుల బతుకమ్మ నిర్వహిస్తారు. అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారు. పచ్చి అటుకులు, బెల్లం, నువ్వులు, కొబ్బరి, పల్లీల వంటి పదార్థాలతో తయారుచేసిన ప్రసాదాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు. మహిళలంతా కలిసి ప్రసాదాన్ని పంచుకుంటారు. సమానత్వానికి, సహజ జీవనానికి అటుకుల బతుకమ్మ నిదర్శనంగా నిలుస్తుంది.

మూడోరోజు.. ముద్దపప్పు బతుకమ్మ 

ఉడికించిన పప్పును నైవేద్యంగా సమర్పించి బతుకమ్మను ఆటపాటలతో కొలుస్తారు. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం మాత్రమే కాకుండా సంపన్నతకు, సంపూర్ణతకు ముద్దపప్పు బతుకమ్మను సంకేతంగా కొలుస్తారు.

నాలుగోరోజు నానబియ్యం బతుకమ్మ 

బతుకమ్మ పండుగ వేడుకల్లో భాగంగా నాలుగోరోజు బతుకమ్మకు నాన (తడి) బియ్యం నైవేద్యంగా సమర్పిస్తారు. వంట చేయకుండానే తక్కువ పదార్థాలతో తయారయ్యే నానబియ్యం నైవేద్యం తగ్గిస్తూ భక్తిని వ్యక్తపరిచే విధానంగా భావిస్తారు. గ్రామీణ స్త్రీల సహజమైన సరళ జీవనశైలికి నానబియ్యం బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుంది.

ఐదవ రోజు అట్ల బతుకమ్మ 

బతుకమ్మ పండుగ వేడుకల్లో భాగంగా 5వ రోజు బతుకమ్మకు అట్లు (దోశలు) నైవేద్యంగా సమర్పిస్తారు. అట్ల బతుకమ్మ రోజున అమ్మమ్మలు తమ పిల్లలకు అట్ల తయారీ తీరును నేర్పుతారు. మహిళల మధ్య ఆత్మీయత, భక్తిని పంచుకుంటారు. ఇది కుటుంబ బంధాలను బలపరుస్తుంది. సంప్రదాయ తెలంగాణ వంటకాల గొప్పదనాన్ని గుర్తుచేస్తుంది. భోజన సంస్కృతిని పూజామార్గంగా చూపే సందర్భంగా పేర్కొంటారు.

ఆరవరోజు అలిగిన బతుకమ్మ 

బతుకమ్మ పండుగ వేడుకల్లో భాగంగా ఆరో రోజు బతుకమ్మకు ఎలాంటి నైవేద్యం సమర్పించరు. అలిగిన బతుకమ్మ అనేది బతుకమ్మ పండుగలో అమ్మవారిని ఓదార్చే సందర్భాన్ని సూచిస్తుంది. బతుకమ్మ అమ్మవారి మనసులో కొంత అలిగి దూరంగా వెళ్లినట్టుగా భావిస్తారు. అయితే చివరికి ఆమె మన భక్తిని చూసి తిరిగి వస్తుందని నమ్మిక. తల్లిబిడ్డల మధ్య నోచ్చుకోవడం, ఒడిదుడుకులను వదిలేసి చివరకు కలిసిపోవడాన్ని సూచిస్తుంది. 

ఏడో రోజు వేపకాయ బతుకమ్మ 

బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఏడవ రోజు వేపకాయలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చే రోజుగా అమ్మవారికి వేపకాయ, పెరుగు, మిర్యాల పొడి వంటివి కలిపి ప్రత్యేక నైవేద్యంగా సమర్పిస్తారు. శరీర శుద్ధికి సంకేతంగా ఏడవరోజును చెప్పుకుంటారు. వేపకాయ ఆరోగ్యానికి మంచిదని రోగ నిరోధక శక్తిని పెంచుతుందని భావిస్తారు. వేపకాయ, వేప విత్తనాలతో అమ్మవారికి నైవేద్యం ఇవ్వడం ద్వారా తీర్థశుద్ధి పాప విమోచనం, ఆరోగ్య సౌఖ్యానికి ఆకాంక్షను వ్యక్తపరుస్తారు.  

ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ 

బతుకమ్మ పండుగ వేడుకల్లో భాగంగా 8వ రోజు వెన్న ముద్దలను నైవేద్యంగా సమర్పిస్తారు. విడి అన్నంలో వెన్న వేసి కొద్దిగా ముద్దలు చేసి తయారు చేస్తారు. వెన్న ముద్దలను అమ్మవారికి నివేదించడం ద్వారా ‘సంపూర్ణ ఆహారాన్ని సమర్పించడం.. సంతృప్తి పూజ చేయడం’ అనే భావన నిక్షిప్తంగా ఉంటుంది. వెన్న ముద్దలు శరీరానికి శక్తిని, పోషకాలను అందిస్తాయి. అమ్మవారికి ఇవి నివేదించడం ద్వారా కుటుంబానికి ఆరోగ్యం, సంపద, శాంతి కలుగుతుందని భావిస్తారు. అమ్మవారిని తల్లిగా భావించి అదే ప్రేమతో నివేదన చేస్తారు.

తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ 

బతుకమ్మ పండుగకు శిఖర దశ సద్దుల బతుకమ్మ వేడుకలు. తొమ్మిదో రోజు బతుకమ్మ వేడుకల్లో భాగంగా పులిహోర, పెరుగన్నం, కొబ్బరి అన్నం, బెల్లం అన్నం, నిమ్మకాయ అన్నం, చెక్కర పొంగలి, వేరు మిరియాల అన్నం ఇవన్నీ కలిపి, వివిధ రకాల నైవేద్యాలతో కూడిన ప్రసాదాలతో సద్దులు కట్టి బతుకమ్మలను సాగనంపుతారు. తీరొక్క పూలతో తీర్చిదిద్ది మహిళలంతా సామూహికంగా ఆటపాటలతో బతుకమ్మలను కొలిచి, మళ్లొచ్చే ఏడాది వరకు మంచి బతుకును ఇవ్వమని వేడుకుంటూ.. అమ్మవారు మళ్లీ వచ్చే ఏడాది మళ్లీ వస్తారని ఆశతో కొత్త శకానికి స్వాగతం.. పాత ఏడాదికి వీడ్కోలు అంటూ తీరొక్క పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలను నిండు మనసుతో చెరువులు, జలాశయాల్లో నిమజ్జనం చేస్తారు.

ఔషధ గుణాలెన్నో..

ప్రకృతి పండుగ బతుకమ్మను మహిళలు భక్తి పారవశ్యంతో జరుపుకోవటం ఆనవాయతీ. శీతాకాలపు తొలిరోజుల్లో వచ్చే ఈ పండుగ వేళ వర్షాలతో జలాశయాలు కళకళలాడుతుంటాయి. రకరకాల రంగురంగుల పువ్వులు వికసించి కనువిందు చేస్తుంటాయి. గునుగు, తంగేడు పూలు ఎక్కడ చూసినా విరబూసి ఉంటాయి. బంతి, చేమంతి, నందివర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సీజన్. సోంపు పూలు, టేకు పూలు కూడా ఇదే సీజన్‌లో లభిస్తాయి.

గుమ్మడి, కట్లాయి, అల్లీపూలు ఇదే సమయంలో విరబూస్తాయి. అశ్వయుజ మాసం నుండి బతుకమ్మ వేడుకలు ఆరంభమవుతాయి. బతుకమ్మకు వాడే పువ్వులన్నీ ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. తంగేడు పూలు గొంతు, మూత్ర సంబంధిత సమస్యలకు ఔషధంగా పనిచేస్తాయి. గునుగు పువ్వు యాంటీ డయేరియా, యాంటీ డయోబెటిక్ లక్షణాలు కలిగి ఉంటుంది.

బంతి పువ్వు క్రిమిసంహారిణి, దోమలను నివారించే శక్తిని కలిగి ఉంటుంది. చామంతిని కాలిన గాయాలకు, దెబ్బలకు, కంటి సంబంధిత రోగాలకు, జీర్ణానికి ఔషధంగా వాడతారు. ఇది యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కలిగి కాలుష్య కారకాలైన బెంజిన్, అమ్మోనియా వాయువులను పీల్చుకొని గాలిని శుద్ధి చేస్తుంది. ఇలా బతుకమ్మ పేరిట వాడే ప్రతీ పువ్వుకు అనేక ఔషధ గుణాలున్నాయి.

- బండి సంపత్ కుమార్ (మహబూబాబాద్)/

బల్మూరి విజయసింహా రావు (కరీంనగర్), 

విజయక్రాంతి