calender_icon.png 21 September, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్‌కు బీజేపీ ఫోబియా

21-09-2025 01:12:16 AM

సీఎం పదేపదే కిషన్‌రెడ్డి పేరెత్తుతున్నారు 

కాళేశ్వరంపై సమగ్ర విచారణ జరగలేదు 

  1. కాంట్రాక్టర్లు, లీడర్లనూ విచారించాలి 
  2. ఉద్యోగుల జీతాలు ఇవ్వలేని సీఎం ఓయూకు వెయ్యి కోట్లు ఎలా ఇస్తారు? 
  3. గ్రూప్-1 నియామకాల విషయంలో ప్రభుత్వం విఫలం
  4. స్థానిక ఎన్నికల విషయంలో కాంగ్రెస్ కావాలనే ఆలస్యం చేస్తోంది 
  5. మీడియా చిట్‌చాట్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఫోబియా పట్టుకుందని, అందుకే ప్రతి దానికీ కిషన్‌రెడ్డి పేరే తలుస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధక్షుడు రామ్‌చందర్ రావు విమర్శించారు. కాళేశ్వరం విచారణపై సీబీఐ ఎప్పుడు రావాలనేది వాళ్లు నిర్ణయిస్తారని, అందులో బీజేపీ, మోదీ, కిషన్ రెడ్డికి ఎలాంటి సంబంధం ఉండదని పేర్కొన్నారు.

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పోటీకోసం మూడు, నాలుగు అర్జీలు వచ్చాయని, దీనిపై పార్టీ ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావు మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడుతూ.. సీఎం ఇప్పటికే 50కి పైగా ఢిల్లీ పర్యటనలు చేశారని, ఇంకా చేస్తూనే ఉంటారని.. దీన్ని సెలెబ్రేట్ చేసుకోవాలని ఎద్దేవా చేశారు.

అధికారంలోకి వచ్చి దాదాపు 22 నెలలు కావొస్తున్నా ప్రజలకిచ్చిన రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ లాంటి హామీలను అమలు చేయకుండా కేంద్రం మీద పడితే ఎలా? అని ప్రశ్నించారు. గ్రూప్-1 నియామకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల జీతాలు ఇవ్వలేని సీఎం రేవంత్‌రెడ్డి ఓయూకు వెయ్యి కోట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఓయూలో హాస్టళ్లు, భవనాలు శిథిలావస్తకు చేరాయన్నారు. 

అంతర్జాతీయ సమస్యపై అంతా ఒక్కటవ్వాలి..

అంతర్జాతీయ సమస్యలు వచ్చినప్పుడు పార్టీలకతీతంగా అంతా ఒక్కటి అవ్వాల్సింది పోయి.. కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని, రాహుల్ గాంధీ మన బలగాలను అవమానించేలా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. పాక్ తన సొంత ఇంటిలా అనిపిస్తోందని శ్యామ్ పిట్రోడా మాట్లాడుతున్నారని, ఆయన ట్రైనింగ్ వల్లే రాహుల్ గాంధీ అలా తయారయ్యారని విమర్శించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కొత్తగా ఓట్ చోరి అనే నాటకాన్ని తెరమీదకు తెచ్చి దేశ ప్రజలకు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు.

‘మా నాన్న 3 ఏండ్ల క్రితం మరణించారు. ఆయన పేరు ఇప్పటికింకా ఓటర్ జాబితాలో ఉంది.. దాన్ని తొలగించడానికి దానికో ప్రొసీజర్ ఉంటుంది. అధికారి వచ్చి నిర్ధారించాకే తొలగిస్తారు’ అని వివరించారు. బోగస్ బోట్లు వేరు...ఓట్ల చోరీ వేరని, అది కూడా రాహుల్‌కు తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. ఎన్ని ఓట్లు చోరీ అయ్యాయో, ఎలా చోరీ అయ్యాయో చెప్పాలని సవాల్ విసిరారు. హైడ్రోజన్ బాంబులంటూ అన్ని తుస్సు బాంబులు పేలుస్తున్నారని ఎద్దేవా చేశారు.

గత ఎన్నికల్లో బోగస్ ఓట్లు..

రాష్ట్రంలో గత ఎన్నికల్లో బోగస్ ఓట్లు నమోదయ్యాయని, దీని వెనుక కాంగ్రెస్, ఎంఐఎం పాత్ర ఉందని రాంచందర్‌రావు ఆరోపించారు. ఏపీలో ఎన్నికలు జరిగినప్పుడు ఓటు ఉన్నవారు ఇక్కడి నుంచి చాలా మంది అక్కడికి వెళ్లి ఓటు వేసి వచ్చారన్నారు. బోగస్ ఓట్లపై తాము ఇప్పటికే ఈసీ దృష్టికి తీసుకెళ్లామని, అయితే ఒక్కసారి ఓటు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత తీసేయ్యడం అంతా సులువైంది కాదని వారు చెప్పారని, ఈ విషయం కూడా రాహుల్‌కు తెల్వదా? అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మీ అధికారులే ఉన్నారుకదా..విచారణ ఎందుకు జరిపించరని ప్రశ్నించారు. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లైనప్ విషయంలో ఈటలకు, పార్టీకి మధ్య ఎలాంటి ఇష్యూ జరగలేదని స్పష్టం చేశారు.

ప్రత్యామ్నాయం మేమే..

‘రాష్ర్టంలో రాజకీయ శూన్యత వాక్యూమ్ ఉంది, దాన్ని భర్తీ చేసి ప్రత్యామ్నాయంగా ఎదుగుతాం. ఇప్పుడిప్పుడే కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. కాళేశ్వరం విషయంలో సీబీఐకి కేసు ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది వాస్తవమే. అయితే సీబీఐ వాళ్లు ఎప్పుడు రావాలనేది వాళ్లు నిర్ణయిస్తారు. కేసు ఎఫ్‌ఐఆర్ కావాలి. దాన్ని స్టడీ చేయాలి. వారు రావాలనుకుంటే వస్తారు. ఇందులో బీజేపీకి, మోదీకి ఎలాంటి సంబంధం ఉండదు.

కాళేశ్వరం విచారణ మొత్తం ప్రాజెక్టుపై చేయాలి. కాంట్రాక్టర్లు, రాజకీయనేతలపై కూడా విచారణ చేయాలి. అవినీతిపైన విచారణ చేయకుండా బ్యారేజీ కూలినదానిపై విచారణ చేశారు. కమిషన్ విచారణలో నిందితులు ఎవరన్నది తేల్చిందా? రాజకీయ నాయకులకు ఎవరినైనా అరెస్టు చేశారా?’ అని ప్రశ్నించారు. డబ్బు సంచులపై చేయకుండా సిమెంట్ బస్తాలపైన మాత్రమే విచారణ చేశారని ఆయన ఎద్దేవా చేశారు.

నక్సల్స్‌కు డబ్బులు, ఆయుధాలు ఎలా వస్తున్నాయ్..

నక్సల్స్‌కు డబ్బులు, ఆయుధాలు ఎలా వస్తున్నాయని రాంచందర్‌రావున ప్రశ్నించారు. వారి వెనుక విదేశీయుల హస్తం ఉందనేది అర్థమవుతోందన్నారు. అందుకే వారిని లొంగిపోవాలని డెడ్‌లైన్ విధించామని స్పష్టం చేశారు. నక్సల్స్‌ను చర్చల కోసం మీరు(కాంగ్రెస్) పిలిచి ఎన్‌కౌంటర్ చేయొచ్చు.. కానీ మేం మాత్రం నక్సల్స్‌ను పిలిచి చర్చించాలా? అని ని లదీశారు. పాకిస్థాన్‌తో చర్చలు జరిపామంటే అంది అంతర్జాతీయ సమస్య అని, నక్సల్స్‌ది ఇంటి సమస్యలాంటిదని, వారితో చర్చలకు తావులేదని, లొంగిపోవాల్సిందేనన్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం కాంగ్రెస్‌కు లేదని అందుకే ఆలస్యం చేస్తోందన్నారు.

జూబ్లీహిల్స్ ఎన్నికలపై కమిటీలో నిర్ణయం..

అప్పులు, అవినీతి, నిరుద్యోగం లో తెలంగాణ రైజింగ్ ఉందని, ఎ ప్పుడో ఒకరోజు కిందకు పడిపోతుందని రాంచందర్‌రావు విమర్శించా రు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ తనకు రెండు మూడు అప్లికేషన్లు వచ్చాయన్నారు. అయితే దీనిపై తమ ఎన్నికల కమిటీ నిర్ణ యం తీసుకుంటుదన్నారు. రాష్ట్ర కమిటీలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేశామన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ విషయం పార్టీ పెద్దవాళ్లు చూసుకుంటారని, ఆ విషయంలో తాను మాట్లాడనని రామ్‌చందర్ రావు వెల్లడించారు. సమావేశంలో పార్టీ చీఫ్ స్పోక్స్‌పర్సన్ ఎన్‌వీ సుభాష్ పాల్గొన్నారు.