calender_icon.png 21 September, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతారామకు ప్రాధాన్యం

21-09-2025 01:04:18 AM

  1. ఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యం 
  2. ప్రధాన కాలువ పనులకు అత్యంత ప్రాధాన్యం
  3. సమీక్షలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 
  4. పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, పొంగులేటి, తుమ్మల

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): సీతారామ ప్రాజెక్ట్ పనుల వేగవంతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన సీతారామ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై ఉన్నతిస్థాయి సమావేశం జరిగింది.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ సమావేశంలో పాల్గొని చర్చించినట్టు సమాచారం. ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని ఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్ట్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది.

పనులు వేగవంతంగా పూర్తి కావడానికి ప్రధాన కాలువ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రులు అధికారులకు సూచించారు. రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, సీతారామ ప్రాజెక్ట్ ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేసి, సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

రైతు సంక్షేమమే పరమావధిగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే రైతులకిచ్చిన హామీలను నెరవేర్చామని తెలిపారు. ఈ సమావేశంలో తుమ్మిడిహెట్టి సవరించిన డీపీఆర్ (వివరాల ప్రాజెక్టు నివేదిక) తయారీ, దానిని ఖరారు చేసే విధానంపై ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. ప్రాజెక్టును వేగవంతం చేసి, సకాలంలో పూర్తి చేయడం ద్వారా దిగువ ప్రాంతాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.