04-10-2025 07:21:35 PM
కామారెడ్డి వర్ష బీభత్సాన్ని రికార్డ్ చేసిన జలవిలయం పుస్తకం
తెరవే జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్
కామారెడ్డి (విజయక్రాంతి): ఇటీవల కామారెడ్డి జిల్లాను అతలాకుతలం చేసిన వర్ష బీభత్స రోదనను భవిష్యత్తులో జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కవులు తమ కవిత్వంతో వివరించిన పుస్తకం "జలవిలయం" లో అనేక సూచనలు ఉన్నాయని తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్ అన్నారు. శనివారం కామారెడ్డి లోని తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో కామారెడ్డి వర్ష బీభత్సం, కవిత్వం జలవిలయం పుస్తకాన్ని తెరవే జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గఫూర్ శిక్షక్ మాట్లాడుతూ కామారెడ్డిలో మేఘ విస్పోటనం సృష్టించిన వరద తాకిడిలో కామారెడ్డి జిల్లా అతలాకుతలం అయ్యిందని వరద ఒకవైపు చుట్టుకుంటే ప్రజలు సర్వం కోల్పోయారని రైతుల పంటలన్నీ నష్టపోయాయని ఊహించని విధంగా ఈ విస్ఫోటనం జరిగినప్పటికీ కామారెడ్డి ప్రాంత ప్రజలకు తీరని శాపాన్ని మిగిలిచ్చిందని కామారెడ్డిలోని నాలాలు కబ్జాలకు గురి అయ్యాయని అండర్ డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం నీటిని సరి అయిన రీతిలో పంపించే వ్యవస్థ లేకపోవడం చెరువులు, వాగులు కబ్జాలకు గురికావడం కామారెడ్డికి తీరని నష్టాన్ని కలిగించిందని ప్రజల బాధలను, రైతుల బాధలను ఈ జలవిలయం పుస్తకంలో రికార్డ్ చేశామని పర్యావరణ సమస్యల పట్ల జనం జాగృతం కావలసిన అవసరం ఉన్నదని అన్నారు. ఈ పుస్తకంలో భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కవితల రూపంలో సూచించామన్నారు.
ఈ వరదల్లో నష్టపోయిన ప్రజలకు రైతులకు ఈ పుస్తకాన్ని అంకితం చేసామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి పలు తీర్మానాలను ప్రకటించిందన్నారు. 28 మంది కవులు రాసిన కవితలు వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయని సమాజానికి ఎప్పుడూ బాధ కలిగిన తెరవే అండగా నిలుస్తుందని అన్నారు. కరోనా సమయంలో కరోనాపై కవితాస్త్రం పుస్తకాన్ని, ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సైరన్ పుస్తకాన్ని గతంలో తెచ్చామని అదేవిధంగా కామారెడ్డి లో జలవిలయం సృష్టించిన బీభత్సం నష్టపోయిన ప్రజలకు అక్షరాలతో అండగా నిలిచామన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంకటి అధ్యక్షత వహించగా తెరవే ప్రధాన కార్యదర్శి మోహన్ రాజ్, ఎన్నిల ముచ్చట్లు సమన్వయకర్త గంగా ప్రసాద్, తెరవే జిల్లా ఉపాధ్యక్షులు మంద పీతాంబర్, నాగభూషణం, రామచంద్రం, సంగ గౌడ్, తిరుపతిరావు, తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కందుకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.