11-08-2025 01:51:15 AM
50 నుంచి 90 శాతం అగ్గువకే మందులు
హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): పేదలకు తక్కువ ధరకే మందులను అందించడానికి జన ఔష ధి కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సాధారణ మెడికల్ దుకాణాల్లోని మందుల ధరలతో పోలిస్తే జన ఔషధి మెడికల్ షాపుల ద్వారా 50 నుంచి 90 శాతం వరకు తక్కువ ధరకే మందులను అందిస్తున్నామన్నారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు పెద్దఎత్తున జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు భారీ మొత్తంలో సబ్సిడీ అంది స్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం ఐడీఏ ఉప్పల్‌లో జన ఔషధి కేంద్రాలకు సంబంధించి డిపోను గవర్నర్ జిష్ణుదవ్ వర్మతో కలిసి ప్రారంభించారు. ఔషధాలను చాలా తక్కువ ధరకే అందించి, ప్రజల జేబులకు చిల్లులు పడకుండా ఉండేందుకు మోదీ సర్కారు జన ఔషధి కేంద్రాలను ప్రవేశపెట్టిందన్నారు.
ఆయుష్మాన్ భారత్‌తో ఉచిత చికిత్స
గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకుండా తత్సారం చేశారని, అలా కాకుండా రాష్ర్టంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరారు. ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగా తమకు తెలియకుండానే అనారోగ్యం పాలవుతున్నారని, ప్రతి వంద మందిలో 95 మంది డాక్టర్ల దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తుతోందన్నారు.
రిటైర్ అయిన వారు పెన్షన్ మొత్తం వైద్య ఖర్చుల కోసమే వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలు కూడా అనారోగ్యం పాలైతే జీవితం మొత్తం సంపాదించిన సంపాదన వైద్యం కోసమే ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.
అందుకే ప్రధాని మోదీ పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించి ప్రతి వ్యక్తికి ఏటా రూ.5 లక్షల ఉచిత బీమా అందించే ఆయుష్మాన్ భారత్ ఫథకాన్ని తీసుకొచ్చారని అన్నారు. 70 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఉచితంగా ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఉచిత చికిత్స అందిస్తున్నామన్నారు. తెలంగాణలో బస్తీ దవాఖానాల్లో వెల్‌నెస్ సెంటర్లను ప్రవేశపెట్టామని, ఈ వ్యవస్థ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే నడిపిస్తోందని వెల్లడించారు.