calender_icon.png 11 August, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సృష్టి కేసు.. రంగంలోకి ఈడీ

11-08-2025 01:32:42 AM

- కేసు వివరాలు కోరుతూ పోలీసులకు లేఖ

- డాక్టర్ నమ్రత నయవంచన బట్టబయలు 

- 8 రాష్ట్రాల్లో నెట్‌వర్క్, కోట్లలో మనీ లాండరింగ్

- 80 మంది శిశువుల విక్రయం.. 25 కోట్లకు పైగా ఆర్జన

- విదేశాల్లోని పలు సంస్థల్లో పెట్టుబడులు?

- ఆర్థిక లావాదేవీలపైనే ఈడీ ప్రధానంగా దృష్టి

- విశాఖ కేజీహెచ్ కేంద్రంగా దళారుల అరెస్టు

- బయటపడుతున్న సంచలన నిజాలు

హైదరాబాద్, సిటీబ్యూరో అగస్టు 10 (విజయక్రాంతి): సంతాన సాఫల్య కేంద్రం ము సుగులో సాగుతున్న పిల్లల అక్రమ రవాణా కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారంలో భారీగా మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. కేసు పూర్తి వివరాలు అందించాలని హైదరాబాద్ పోలీసు లకు ఈడీ అధికారులు అధికారికంగా లేఖ రాయడం తీవ్ర కలకలం రేపుతోంది.

ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఏకం గా ఎనిమిది రాష్ట్రాల్లో తన కార్యకలాపాలు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. సరోగసీ పేరుతో అమాయక దంపతులను మోసం చేయడమే కాకుండా, పేద కుటుంబాల నుంచి శిశువులను కొనుగోలు చేసి కోట్లాది రూపాయలు ఆర్జించి నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు 30 మందిని అరెస్టు చేసి విచారించగా, ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు వెలు గులోకి వస్తున్నాయి.

రూ. 25 కోట్ల దందా.. విదేశాలకు తరలింపు?

పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం, డాక్టర్ నమ్రత ముఠా సుమారు 80 మంది పిల్లలను అక్రమంగా విక్రయించినట్లు తేలిం ది. సంతానం లేని దంపతుల ఆశను ఆసరాగా చేసుకుని, వారి నుంచి రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు వాపోతున్నారు. ఈ విధం గా సుమారు రూ. 25 కోట్లకు పైగా వసూలు చేసి, ఆ డబ్బును విదేశాల్లో పెట్టుబడులుగా పెట్టినట్లు పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ ఆర్థిక లావాదేవీలపైనే ఈడీ ప్రధానంగా దృష్టి సారించనుంది.

విశాఖ కేంద్రంగా దందా

ఇటీవల విశాఖపట్నంలోని కేజీహెలో పిల్లల విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు దళారులను పోలీసులు అరెస్టు చేయడంతో ఈ కేసులో కీలక ములుపు చోటుచేసుకుంది. నిరుపేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని, వారి నుంచి పిల్లలను కొనుగోలు చేయడంలో వీరు కీలక పాత్ర పోషించారు. వీరి విచారణలో డాక్టర్ నమ్రతతో ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. ఈ దళారుల ద్వారానే నమ్రత చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

ఈ కుంభకోణంలో మరికొందరు వైద్యులు, సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు తేలడంతో అరెస్టుల సంఖ్య 30కి చేరింది. గతంలో కూడా డాక్టర్ నమ్రతపై ఇలాంటి ఆరోపణలతో విశాఖలో క్రిమినల్ కేసులు నమోదైనప్పటికీ, వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పించుకున్నారని, అదే అలుసుగా తీసుకుని తన అక్రమ సామ్రాజ్యాన్ని దేశవ్యాప్తంగా విస్తరించారని తెలుస్తోంది. ఈడీ దర్యాప్తుతో ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు, పెద్ద తలల ప్రమేయం బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.