11-08-2025 01:57:48 PM
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి,(విజయక్రాంతి): జిల్లాలో అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష(District Collector Koya Sree Harsha ) సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. రామగిరి మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన ఆవునూరి పద్మ తమ ఇండ్లు శిథిలావస్థలో ఉందని తమకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్ కు రాస్తూ విచారణ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
పెద్దపల్లి పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త రామన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ సమీపంలో నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయని వీటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా మున్సిపల్ కమిషనర్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పాలకుర్తి మండలం నిట్టూరు గ్రామానికి చెందిన రామ్మోహన్ రావు సర్వే నెంబర్ 503 లోని ప్రభుత్వ భూమిలో పంపు కట్టారని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పెద్దపల్లి ఆర్డీవో కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.