15-07-2025 01:30:42 AM
నేడు సిట్ ముందుకు మరోసారి ప్రభాకర్ రావు
హైదరాబాద్, సిటీబ్యూరో జూలై 14 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగవంతంగా కొనసాగు తోంది. ఈ కేసులో భాగంగా బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకుడు వట్టే జానయ్య సోమవారం సిట్ విచారణకు హాజరయ్యారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన వట్టే జాన య్య ఫోన్‌ను అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ట్యాపింగ్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీచేయగా, ఆయన ఇవాళ దర్యాప్తు అధికారుల ఎదుట హాజరయ్యారు.
ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న పరిణామాలపై ఆయన వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేసుకున్నారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు మంగళవారం మరోమారు ప్రశ్నించనున్నా రు.
ఇప్పటికే ఈ కేసులో పలువురు సాక్షులు, బాధితులు ఇచ్చిన వాం గ్మూలాల ఆధారంగా ప్రభాకర్ రావు ను లోతుగా ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. సాక్షుల వాంగ్మూలాల్లోని అంశాలను ఆయన ముందుంచి, కీలక సమాచారాన్ని రాబట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ పరిణామాలతో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకోనుందని భావిస్తున్నారు.