calender_icon.png 15 July, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేప పిల్లల కేంద్రాలు తిమింగళాలకు!

15-07-2025 12:09:11 AM

  1.    2018-19 నుంచి నిలిచిన చేప పిల్లల ఉత్పత్తి
  2. పడావుగా ఉండటంతో కబ్జాకు గురవుతున్న భూములు
  3.  అటువైపు చూడని మత్స్యశాఖ అధికారులు 
  4.  ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్న మత్స్యకార సొసైటీలు  
  5.  రాజేంద్రనగర్‌లో 10 ఎకరాలకు మిగిలింది ఐదారు ఎకరాలే 
  6. నల్లగొండ జిల్లా తుమ్మడంలోనూ 15 ఎకరాల వరకు కబ్జా
  7. కబ్జాలపై విచారణ జరిపిస్తాం: ఫిషరీష్ కార్పొరేషన్

హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): తెలంగాణలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు వినియోగంలో లేకపోవడంతో వాటి స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2015-16 నుంచి 2018-19 వరకు చేప పిల్లలను ఉత్పత్తి చేశారు. ఏడేళ్లుగా ఉత్పత్తి కేంద్రాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మూలనపడ్డాయి. దీంతో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలకు సంబంధించిన భూములు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లాయి.

చేప పిల్లలను ఉత్పత్తి చేసి, వాటిని రాష్ట్రవ్యాప్తంగా చెరువుల్లోకి పంపిణీ చేసేందుకు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం 30 చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు చేపల ఉత్పత్తికి 21 కేంద్రాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి.

ఒక్కో ఉత్పత్తి కేంద్రానికి గతంలో కనీసం 10 ఎకరాల నుంచి గరిష్టంగా 90 ఎకరాల వరకు అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఎక్కువ భూమి ఉన్న ఫిష్ కేంద్రాలను స్థానికంగా ఉన్న కొందరు నాయకులు తమ పలుకుబడిని ఉపయోగించుకుని గత పదేళ్లలో భూ కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. 

ప్రతీ కేంద్రంలోనూ కబ్జా..

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రానికి ఉమ్మడి రాష్ట్రంలోని అప్పటి టీడీపీ ప్రభుత్వం 10 ఎకరాల భూమి కేటాయించగా, ఇప్పుడు 5 నుంచి 6 ఎకరాల భూమి మిగిలిందని మత్స్యకార సొసైటీ సంఘాలు చెబుతున్నాయి. అయితే లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న చేప పిల్లల ఉత్పత్తి కేంద్రానికి సంబంధించిన భూమిని స్వాధీనం చేసుకున్న అప్పటి ప్రభుత్వం..రాజేంద్రనగర్‌లో 10 ఎకరాల భూమిని చేపల ఉత్పత్తి కేంద్రానికి కేటాయించింది.

నల్లగొండ జిల్లా తుమ్మడంలో 90 ఎకరాలు ఉండగా, ప్రస్తుతం 75 ఎకరాలు మాత్రమే మిగిలి ఉందని మిగతా భూమి కబ్జాకు గురైందని చెబుతున్నారు. కరీంనగర్‌లోని కేశవపట్నం చేప పిల్లల ఉత్పత్తి కేంద్రానికి సంబంధించిన 12 ఎకరాల భూమి కబ్జారాయుళ్ల చేతిలోకి వెళ్లగా 75 ఎకరాల భూమి మాత్రమే మిగిలింది. మేడ్చల్‌లోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని పూర్తిగా నిర్మూలించి..అక్కడ ట్రైనింగ్ కేంద్రాన్ని గత ప్రభుత్వం రూ.లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసింది.

అయితే ఆ ట్రైనింగ్ కేంద్రం ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోలేదు. ఈ సెంటర్‌లో చేప పిల్లలను ఏలా ఉత్పత్తి చేయాలి.. వాటి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇవ్వాలని ఏర్పాటు చేశారు.

కాగా, కరీంనగర్‌లోని ఎల్‌ఎండీ వద్ద 14 ఎకరాలు, కేశవపట్నంలో 60 ఎకరాలు, నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద 41.14 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా మంజీరానదీ వద్ద 24.08 ఎకరాలు, మెదక్‌లో 15.35 ఎకరాలు, నల్లగొండ జిల్లా  తుమ్మడంలో 75 ఎకరాలు, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 25 ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం కిన్నెరసాని వద్ద 13.18 ఎకరాల భూమి, రాజేంద్రనగర్‌లో 6 ఎకరాల వరకు భూమి ఉంది.

ఇలా ప్రతీ చేప పిల్లల కేంద్రంలో దాదాపు 10 నుంచి 15 శాతం వరకు భూమి కబ్జాకు గురైందని చెబుతున్నారు. భూ కబ్జాలపై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మత్స్యకార సొసైటీలు ఆరోపిస్తున్నాయి. 

చేప పిల్లల కొనుగోలుతో అదనంగా రూ.30కోట్ల భారం.. 

చేప పిల్లలను ఉత్పత్తి చేస్తే రూ.40కోట్ల నుంచి రూ.50కోట్ల వరకు మాత్రమే ఖర్చు అవుతుందని, ఇతర రాష్ట్రాల నుంచి చేప పిల్లలను కొనుగోలు చేయడం వల్ల ప్రతి ఏటా రూ.80 కోట్ల వరకు ఖర్చవుతోందని మత్స్యకార సొసైటీల సభ్యులు చెబుతున్నారు.

దీంతో ప్రభుత్వంపై ప్రతి ఏటా అదనంగా రూ.30 కోట్ల వరకు భారం పడుతోందనే విమర్శలు ఉన్నాయి. చేప పిల్లలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఒక చేప పిల్లకు రూ.2నుంచి రూ.2.30 పైసలు ఖర్చు చేస్తున్నారు. కమీషన్ల కోసం గత పాలకులు ఈ నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

కాగా తెలంగాణలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు  అదిలాబాద్‌లోని శత్నాల, కరీంనగర్ ఎల్‌ఎండీ, కేశవపట్నం, శనిగరం, సిరిసిల్ల జిల్లా యూఎండీ, హనుమకొండ, వైరా, కిన్నెరసాని, పోచంపాడు, అర్సపల్లి, నిజాంసాగర్, మెదక్, సింగూర్, సంగారెడ్డి, పిల్లలమర్రి, జమ్మిచెడు, కోయిలసాగర్, ముచ్చర్లపల్లి, చంద్రసాగర్, నడివాగు, డిండి, మేడ్చల్, సెరిగూడ, రాజేంద్రనగర్, ఎఫ్‌ఎఫ్‌డీఏ, బీమారం, తుమ్మడం, కడెం, సరళసాగర్‌లో  చేప పిల్లల ఉత్పత్తి చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

భూ కబ్జాలపై విచారణ జరిపిస్తాం

చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలకు సంబంధించిన భూములు కబ్జాలకు గురైనట్లు మా దృష్టికి వచ్చింది. గత బీఆర్‌ఎస్  ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాలకు పాల్పడ్డారు. ఈ భూ కబ్జాలపై తమ ప్రభుత్వం  విచా రణ జరిపిస్తుంది. కబ్జాకు గురైన భూమిని స్వా ధీనం చేసుకోవడం తోపాటు వారిపై చర్యలు తీసుకుంటాం. మూతపడిన చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను పునఃప్రారంభిస్తాం.

తెలంగాణకు సరిపడా చేప పిల్లలను  ఇక్కడనే ఉత్పత్తి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. గత ప్రభుత్వంలో కొందరు నాయకులు కమీషన్లకు కక్కుర్తిపడే  పక్కరాష్ట్రాల నుంచి చేప పిల్లలను కొనుగోలు చేసి.. ఇక్కడ పంపిణీ చేశారు. తాము అత్యాధునిక మిషన్లు ఏర్పాటు చేసి.. ఇక్కడనే ఉత్పత్తి చేస్తాం. అవసరమైతే ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తాం.   

 మెట్టు సాయికుమార్ , 

ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్