05-07-2025 02:05:11 AM
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): తెలంగాణ కాంగ్రెస్ కమిటీ నేతృత్వంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సామాజిక న్యాయ సమరభేరి సభ విజయవంతమైంది. దీంతో హస్తం పార్టీ నాయ కులు, కార్యకర్తల్లో నయా జోష్ నిండింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు వేలాదిగా గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు హాజరుకావడంతో హైదరాబాద్ నగరం జనసంద్రంగా మారింది.
కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని, నైతిక బలాన్ని ఈ సభ మరోసారి రుజువు చేసినట్టు అయ్యింది. గ్రామీణ స్థాయి నుంచి వందలాది బస్సులు, వాహనాల్లో కార్యకర్తలు సభకు వేలాదిగా తరలొచ్చారు. ప్రతి నియోజకవర్గం నుంచి జనం రావడంతో సభ విశేష ఆకర్షణగా నిలిచింది. సభను సక్సెస్ చేసేందుకు పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ ముందుగానే ఉపాధ్యక్షులను, ప్రధాన కార్యదర్శులను నియోజకవర్గాలకు బాధ్యులుగా నియమించి క్షేత్రస్థాయి పరిశీలన చేశారని గాంధీభవన్ వర్గాలు చెబు తున్నాయి.
సభలో మల్లికార్జున్ ఖర్గే, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, మహేశ్ గౌడ్ ప్రసంగాలు హైలెట్‌గా నిలిచాయి. ప్రజల సమస్యలు, సామాజిక న్యాయం పట్ల కాంగ్రెస్ నిబద్ధతను వారు స్పష్టంగా వ్యక్తీకరించారు. మొత్తం మీద సామాజిక న్యాయభేరి గ్రాండ్ సక్సెస్ తో పార్టీ నాయకులు మరింత ఉత్సాహంగా ఉన్నారు. కాగా, పార్టీ నాయకులు శుక్రవారం బిజీబిజీగా ఉన్నారు.
ఉదయం గాంధీభవన్ ఆవరణలో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం, ఆ తర్వాత పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. స్థానిక సంస్థలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించా లని పార్టీ శ్రేణులకు నాయకులు దిశానిర్దేశం చేశారు. అంతే కాకుండా నాయకులు పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా చేశారు.