18-12-2025 12:28:53 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 17 (విజయక్రాంతి): ట్రాఫిక్ ఉల్లంఘనల చలాన్ల మాఫీ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నర్సింగరావుపై బదిలీ వేటు వేశారు. ఆయనతో పాటు మరో ముగ్గురు సిబ్బందిని కూడా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చలాన్లను క్లియర్ చేసేందుకు, పెండింగ్ చలాన్లను మాఫీ చేసేందుకు సీఐ నర్సింగరావు, ఇతర సిబ్బంది పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటున్నట్లు సీపీకి ఫిర్యాదులు అందాయి.
దీంతో సీపీ తక్షణమే వారిపై చర్యలకు ఉపక్రమించారు. ఇన్‌స్పెక్టర్ నర్సింగరావుతో పాటు ఎస్‌ఐ అశోక్, హోంగార్డ్ కేశవులు, కోర్టు కానిస్టేబుల్ సుధాకర్లను బదిలీ చేశారు. వీరిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని ఆదేశించారు.పోలీస్ శాఖలో అవినీతిని ఏమాత్రం సహించేది లేదని, జీరో టోలరెన్స్ పాటిస్తామని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఇటీవల అవినీతి ఆరోపణలు వచ్చిన ఇద్దరు ఏసీపీలు, నలుగురు ఇన్స్పెక్టర్లపై కఠిన చర్యలు తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.