18-12-2025 11:51:16 AM
హైదరాబాద్: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పత్తిచేనులోకి దూసుకెళ్లిన ఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. కెరమెరి మండలం పరాంధోలి గ్రామం సమీపంలోని ఘాట్ రోడ్డుపై బ్రేకులు ఫెయిల్ టీజీఆర్టీసీ బస్సు పత్తి చేనులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక మహిళా ప్రయాణికురాలికి తీవ్ర గాయాలు కాగా, మరో 29 మందికి స్వల్ప గాయాలయ్యాయి. పరంధోలి గ్రామం నుండి ఆదిలాబాద్ వెళ్తున్న బస్సు వాలుగా ఉన్న ప్రదేశంలోకి రాగానే బ్రేకులు ఫెయిలైనట్లు గమనించిన డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును పత్తి చేనులోకి మళ్లించి పెద్ద ప్రమాదాన్ని నివారించాడు. గాయపడిన ప్రయాణికులను ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో టీజీఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.