05-08-2025 01:25:55 AM
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్
మహబూబ్ నగర్ రూరల్ ఆగస్టు 4 : కాంగ్రెస్ పార్టీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీలకు ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుకోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నట్లు తెలిపారు. బీసీల 42 శాతం రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందన్నారు. అమలుకోసం కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిపారు. బీసీల రిజర్వేషన్ల కోసం ఈనెల తన ఢిల్లీలో జరిగే ధర్నాలో సీఎంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొంటున్నట్ల తెలిపారు.
ప్రత్యేక రైళ్ల ద్వారా నాయకులు, కార్యకర్తలు ఢిల్లీకి వెళుతున్నట్లు తెలిపారు. సీనియర్ నాయకుడు. ఎస్పీ.వెంకటేశ్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం 23శాతం చేసినట్లు తెలిపారు.
బీసీల రిజర్వేషన్లపై బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లను అణుగదొక్కడానికి బీజేపీ నాయకులు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. బీసీల 42 శాతం రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ అమలుచేస్తుందన్నారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, నాయకులు చంద్ కుమార్ గౌడ్, సీజే బెనహర్ బాలస్వామి, పీర్ సాదిక్ తదితరులు పాల్గొన్నారు.