calender_icon.png 30 December, 2025 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యాహ్న భోజన కార్మికులకు న్యాయం చేయాలి

30-12-2025 06:47:07 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్.త్రివేణి, రాజేందర్ మాట్లాడుతూ… మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించిన వేతనాలు (ఫిబ్రవరి–నవంబర్ 8 నెలలు), కోడిగుడ్ల బిల్లులు (జూలై–నవంబర్ 5 నెలలు), మెస్ చార్జీలు (అక్టోబర్–నవంబర్ 2 నెలలు) పెండింగ్‌లో ఉండటంతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

వేతనాలు రాక అప్పుల ఊబిలో చిక్కుకుని, షావుకార్ల వద్ద అప్పులు చేసి పిల్లలకు భోజనం వండాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఒక కోడిగుడ్డు ధర రూ.8–9 వరకు ఉండగా ప్రభుత్వం కేవలం రూ.6 మాత్రమే ఇస్తోందని కోడిగుడ్లకు అదనపు బడ్జెట్ కేటాయించాలి లేదా ప్రభుత్వమే నేరుగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల కౌటాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజన కార్మికులను అకారణంగా తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు.

క్షేత్రస్థాయిలో పూర్తి విచారణ లేకుండా, కేవలం ఆరోపణల ఆధారంగా కార్మికులను విధుల నుంచి తొలగించడం సరికాదని తెలిపారు. సంబంధిత ఉపాధ్యాయుడిపై తగిన చర్యలు తీసుకుని, తొలగించిన కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెలిశాల కృష్ణమాచారి, జిల్లా కార్యదర్శి పాగిడి పాయతో పాటు రూప మడావి, చంద్రకళ, స్రవంతి, అనసూయ, ప్రణీత, బాగుబాయి, లక్ష్మి, ఊర్మిళ, శ్యామల, సమత తదితరులు పాల్గొన్నారు.