calender_icon.png 18 September, 2025 | 8:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళోజీ కళాక్షేత్రంలో కాకతీయ నృత్య నాటకోత్సవాలు

18-09-2025 06:26:20 PM

హనుమకొండ (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 21 నుంచి రెండు రోజుల పాటు కాళోజీ కళాక్షేత్రంలో కాకతీయ నృత్య నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ నాట్య గురు, అకాడమీ అధ్యక్షురాలు ఆచార్య డాక్టర్ అలేఖ్య పుంజాల తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట యోధ్యురాలు చాకలి ఐలమ్మ కూచిపూడి నృత్య రూపకం, ఓరుగల్లు చరిత్ర కాకతీయ వైభవం గుర్తు చేస్తూ రాణి రుద్రమ చారిత్రక నాటకం, ప్రజా సాహిత్య కళారూపాలు ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు గురువారం ఆమె ఒక ప్రకటనలో ఆయా విశేషాలు వివరించారు. 21వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు డాక్టర్ అలేఖ్య పుంజాల నృత్య దర్శకత్వంలో 30 మంది కళాకారులు చాకలి ఐలమ్మ కూచిపూడి నృత్య రూపకం ప్రదర్శిస్తారు. చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర ను కళ్ళ ముందుంచే ఈ నృత్య రూపకాన్ని డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ రచించగా సంగీత దర్శకుడు వి.బి. ఎస్.మురళి సంగీతం సమకూర్చారు.

22వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు తెలంగాణ డ్రమటిక్ అసోసియేషన్ సదానందం నిర్వహణలో రాణి రుద్రమ నాటకం, అనంతరం గద్దర్ ఫౌండేషన్ సూర్య ఆధ్వర్యంలో ప్రజా సాహిత్య కళా రూపాలు జీవన సంఘర్షణ ప్రదర్శనలు వుంటాయని డాక్టర్ అలేఖ్య పుంజాల వివరించారు. కాకతీయ నృత్య నాటకోత్సవాలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభిస్తారు. తెలంగాణ మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి సీతక్క, కొండా సురేఖ పాల్గొంటారు. ఎంపి కడియం కావ్య, ఎమ్మెల్సీలు బండ ప్రకాష్, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇ. వెంకట రామిరెడ్డి తదితరులు హాజరవుతున్నారు. తెలంగాణ సంగీత నాటక అకాడమి తొలిసారి నిర్వహిస్తున్న కాకతీయ సాంస్కృతికోత్సవాలు ఉచిత ప్రవేశం అని కళాభిమానులు పెద్ద ఎత్తున విచ్చేసి దిగ్విజయం చేయాలని డాక్టర్ అలేఖ్య పుంజాల ఆహ్వానిస్తున్నారు.