16-09-2025 07:21:22 PM
సనత్‌నగర్,(విజయక్రాంతి): ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. మంగళవారం సికింద్రాబాద్ లోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సికింద్రాబాద్, అమీర్ పేట, ఖైరతాబాద్, ముషీరాబాద్ మండలాల పరిధిలోని 47 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ క్రింద మంజూరైన ఆర్ధిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు తులం బంగారం ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారు అని అధికారులను ప్రశ్నించారు.
అనంతరం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ పేద, మద్య తరగతి కుటుంబాల ఆడబిడ్డ పెండ్లికి చేయూత అందించాలనే ఉద్దేశం తో కేసీఆర్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక లక్ష 116 రూపాయల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు అదనంగా తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్నా నేటి వరకు అమలుకు నోచుకోలేదన్నారు.
ప్రజలకు ఇచ్చిన వివిధ రకాల హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడం మరిచారా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలనే ప్రజలు అడుగుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని విమర్శించారు. యూరియా కోసం రైతులు రోడ్ల పైకి వచ్చారని, కె సి ఆర్ ప్రభుత్వం లో ఈ పరిస్థితులు ఉండేనా అని అన్నారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అని, హామీలు అమలు చేయలేమని ప్రజల వద్దకు వెళ్ళి చెప్పే ధైర్యం ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు.