01-08-2025 12:28:19 AM
నిజామాబాద్, జూలై౩౧ (విజయక్రాంతి): జిల్లాలోని బోధన్ మండలం పెంటఖుర్దు గ్రామంలో పురాతన శివాలయ శిథిలాలలో కల్యాణి చాళుక్యుల కాలం నాటి శాసనం లభించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్, చరిత్రకారులు శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. ఈ శాసనంలో రాసి ఉన్న దాన్ని పరిష్కరించినట్లు తెలిపారు. 1984లో గ్రామ సర్పంచు కీ.శే.పరుచూరు రాంచందర్ రావు, కీ.శే. యలవర్తి జయరామారావు, కీ.శే. కొడాలి సూర్యుడమ్మ దేవాలయా న్ని పునరుద్ధరించినపుడు శిథిలాలలో శాసనస్తంభం లభించడంతో దానిని భద్రపరిచారని పేర్కొ న్నారు.
గ్రామస్తుల కృషివల్ల కొత్త శాసనం వెలుగులోకి వచ్చిందన్నారు. పెంటఖుర్దు గ్రా మంలో శ్రీశ్రీమల్లికార్జున దేవాలయ ప్రాంగణంలో నిలిపి ఉన్న రాతి స్తంభానికి మూడు వైపులా 47 పంక్తులలో 11వ శతాబ్దపు తెలుగు లిపిలో, కన్నడభాషలో చెక్కబడిన శిలాశాస నం ఉందన్నారు. దీనిపై కళ్యాణి చాళుక్య చక్రవర్తి త్రైలోక్యమల్లదేవర పాలనాకాలంలో క్రీ.శ. 1058 మార్చి 10వ తేదీన వేయబడిందన్నా రు.
సావడిగేయ పొంరయ అనే భక్తుడు నకరేశ్వరదేవాలయం కోసం చేసిన దానాల వివరాలను గురువు దివాకర భట్టారకయ్యకు అందజేసినట్లు, కొంత భూమి గుడి నిర్వహణ కు దానం చేయబడినట్లు రాసి ఉన్నదని ఆయ న తెలిపారు. శిలాశాసనంపై సూర్యగ్రహణ సందర్భంగా చేసిన దానాలలో గుడికి చెల్లె విధంగా బాటసుంకం, బిట్టకొట్టసుంకం వంటి కొన్ని రకాల పన్నులు మాఫీ చేయబడినట్లుగా ఉందన్నారు.
పెంటఖుర్దుకు 4 కి.మీ.ల దూరంలోని కోటవున్న కోటగిరివద్ద తోట, బావి, 25 రూకల ద్రవ్యమిచ్చినట్లు శాసనం ద్వారా తెలుస్తున్నదని ఆయన వివరించారు. ఈ శాసనం ఆనాటి సామాజిక సంస్కృతికి అద్దం పడుతు న్నదన్నారు. పేరులోనే ప్రాచీనతను పెంటఖుర్దు గ్రామం దాచుకున్నదన్నారు.