01-08-2025 08:22:14 PM
సిద్దిపేట క్రైమ్: ఈ చలాన్ పెండింగ్ ఉన్న వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్(Traffic ACP Suman Kumar) తెలిపారు. రాజీవ్ రహదారి పొన్నాల వై జంక్షన్ వద్ద శుక్రవారం ఆయనతో పాటు ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ విజయ్ భాస్కర్, ట్రాఫిక్ సిబ్బంది వాహనాలను తనిఖీ చేశారు. 450 వాహనాలపై పెండింగ్ లో ఉన్న ఈ చలాన్ కేసులు గుర్తించి, వాటి యజమానులతో జరిమానా కట్టించినట్టు ఏసీపీ తెలిపారు. మూడు లేదా అంతకంటే ఎక్కువ ఈ చలాన్ పెండింగ్ ఉన్న వాహనదారుల ఫోన్ నెంబర్లకు మెసేజ్ వస్తుందని చెప్పారు. దాని ప్రకారం పేటీఎం, ఫోన్ పే, మీసేవ, ఈ చలాన్ ఆన్లైన్ యాప్ ద్వారా జరిమానాలు చెల్లించాలని సూచించారు. అదేవిధంగా వాహనదారులు ట్రాఫిక్, రోడ్డు నిబంధనలు పాటించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన సూచించారు.
51 మందికి రూ. 1,04,500 జరిమానా
ఇటీవల సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తాలలో రాజీవ్ రహదారిపై వాహనాలు తనిఖీ చేయగా, 51 మంది వ్యక్తులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. వారిపై కేసులు నమోదు చేసి, శుక్రవారం సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు ముందు హాజరుపరచగా 51 మందికి రూ.1,04,500 జరిమానా విధించారని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.