05-01-2026 01:12:58 PM
శాసనమండలిలో కవిత భావోద్వేగం
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు(Telangana Assembly sessions) సోమవారం నాలుగో రోజుకు కొనసాగనున్నాయి. శాసనమండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha Emotional) భావోద్వేగానికి లోనయ్యారు. మండలిలో కవిత మాట్లాడుతూ... రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొన్నాళ్లకే తనపై కక్ష మొదలైందన్నారు. 8 ఏళ్లు స్వతంత్రంగా జాగృతి నడిపానని వెల్లడించారు. జాగృతి సంస్థను అడ్డుకోవాలని మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగిందన్నారు. తన దగ్గరకు పెద్దవాళ్లు, పైరవికారులు రాలేదని కవిత సూచించారు.
తాను ఇన్నాళ్లు పేదల కోసమే పనిచేశానని, పార్టీ పేపర్లు, ఛానాళ్లు తనకు మద్దతు ఇవ్వలేదని ఆరోపించారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో తాను ప్రశ్నించినందుకే తనపై కక్షగట్టారని స్పష్టం చేశారు. రాజకీయ కక్షలతో నన్ను జైలులో పెట్టారు. కానీ ఏనాడు నాకు పార్టీ అండగా లేదన్నారు. బీఆర్ఎస్ లో డిసిప్లినరీ కమిటీ అనేది పెద్ద జోక్ అన్నారు. అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలుపెడితే అమరజ్యోతి వరకు ప్రతిదాంట్లో అవినీతి జరిగిందని కవిత ఆరోపించారు. తన ఒపీనియన్ తెలుసుకోకుండా బీఆర్ఎస్ లోంచి సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎటువంటి నైతికత లేని బీఆర్ఎస్ నుంచి వైదొలగుతున్నందుకు సంతోషిస్తున్నాని తెలిపారు. తమది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ అన్నారు. రాజకీయాల్లో మహిళలకు సమాన హక్కులు రావాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులను, మద్దతు తెలిపిన వారిని బీఆర్ఎస్ పార్టీ గుర్తించలేదని విమర్శించారు. రాజీనామా మీద కవిత పునరాలోచించుకోవాలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. కవిత ఆవేదనను ఆర్థం చేసుకుంటామని గుత్తా సుఖేందర్ పేర్కొన్నారు. పునరాలోచన లేదు, రాజీనామా ఆమోదించాలని కవిత కోరారు.