06-01-2026 09:53:21 PM
కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్
సూర్యాపేట,(విజయక్రాంతి): మున్సిపాలిటీలలో ముసాయిదా ఓటర్ జాబితాపై స్వీకరించిన పిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ వెంటనే పరిష్కరించి, ఖచ్చితమైన తుది ఓటర్ జాబితా రూపొందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్లు, సిబ్బందితో ఓటర్ జాబితా తయారీపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల పరిధిలోని 141 వార్డులలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ముసాయిదా ఓటర్ జాబితాను సిద్ధం చేసి, జనవరి 1న వార్డు వారీగా ప్రకటించామన్నారు. ఈ ముసాయిదా జాబితాపై ఇప్పటికే రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి అభ్యంతరాలను స్వీకరించామని, వాటిని వెంటనే పరిష్కరించి ఈనెల 10వ తేదీన తుది ఓటర్ జాబితా ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో బీజేపీ నాయకులు హబీద్, సిహెచ్ నరసింహ, కాంగ్రెస్ చకిలం రాజేశ్వరరావు, సీపీఐ నుంచి బి.వెంకటేశ్వర్లు, బీఎస్పీ నుంచి రాంబాబు, బీఆర్‌ఎస్ నుంచి సవరాల సత్యనారాయణ, లవకుశ, సీపీఎం నుంచి కోట గోపి, వైఎస్సార్‌సీపీ నుంచి డేగల రమేష్, హుజూర్నగర్ నుంచి గెల్లి రవి, సైదా నాయక్ పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్లు హనుమంత రెడ్డి, రమాదేవి, శ్రీనివాస్ రెడ్డి, అశోక్ రెడ్డి, మున్వర్ ఆలీ, సి సెక్షన్ సూపర్డెంట్ సంతోష్ కుమార్, డీటీ వేణు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.