03-01-2026 12:08:31 AM
హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. శుక్రవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి కోమటిరెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. కవిత కేసీఆర్ వదిలిన బాణం అని, ఆమె కన్ఫ్యూజన్‌లో ఉండి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తోంది’ అని మండిపడ్డారు. కవితను పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేశాక, ఆమె ఊరూరా తిరుగుతోందన్నారు.
కవిత ఇప్పుడు బీఆర్‌ఎస్‌లో ఉందా..? బయట ఉందా..? ఏ పార్టీలో ఉందో స్పష్టం చేయాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై స్పందించిందని, హరీశ్‌రావు, కేటీఆర్ విషయంలో ఎందుకు స్పందించలేదని, వారిద్దరినీ ఉరితీసినా తప్పులేదా..? అని మంత్రి ప్రశ్నించారు. కేసీఆర్ దగ్గరున్న నాయకు లందరినీ దూరం చేసేందుకే కవిత విమర్శలు చేసినట్లుగా ఉందన్నారు. కేసీఆర్‌ను తిడితే కవితకు వస్తున్న కోపం.. హరీశ్‌రావును తిడితే ఎందుకు రావడం లేదన్నారు.
కేసీఆర్ రోజూ అసెంబ్లీకి వస్తే పార్టీ పంజుకుంటుందని కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సందేహాస్పదంగా చేసినవే అన్నారు. పాలమూరు. రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్ తప్పు చేసిందని కవిత ఒప్పుకోవడం సంతోషమన్నారు. బీఆర్‌ఎస్ హయాంలోనే నల్లగొండ జిల్లాకు అప్పటి మంత్రి చేసిన అన్యాయంపై కవిత ప్రశ్నించాలని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అంటే తనకు గౌరవమని, ఆయనపై ఎవరేమన్నా తాను కౌంటర్ ఇస్తానని చెప్పారు. తనకు మంత్రి పదవి కావాలని ఎవరిని అడగలేదని, నా తమ్మడు, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డితో ఎలాంటి గొడవలూ లేవన్నారు.