03-01-2026 12:07:48 AM
అశ్వాపురం, జనవరి 2 (విజయక్రాంతి) : పాల్వంచకు చెందిన కేఎల్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాల బస్సు అదుపు తప్పి బోల్తాపడిన ఘటన మండల పరిధిలోని ఎర్రమ్మ తల్లి గుడి అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. మణుగూరు నుంచి పాల్వంచ వైపు వెళ్తున్న బస్సు ఎర్ర మతల్లి గుడి అటవీ ప్రాంతానికి చేరుకోగానే స్టీరింగ్ మెయిన్ రాడ్ విరిగిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయిన కారణంగా ఒక్కసారిగా బస్సు బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 60 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. విద్యార్థులు స్వల్ప గాయాలుతో బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.
గాయపడిన వారిని స్థానికులు భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలిం చారు. విషయం తెలిసిన వెంటనే మణుగూ రు డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి, అశ్వాపురం సీఐ జి. అశోక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కాగా ప్రమాదంపై పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆరా తీశారు.
అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఆయన ఫోన్ ద్వారాఆస్పత్రి వైద్యులు, అధికారులతో మాట్లాడి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బస్సు ప్రమాదానికి గల కారణాలేమిటన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. భయాందోళనలో ఉన్న విద్యార్థులకు ధైర్యం చెప్పారు.