10-04-2025 06:47:46 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి వెళ్లారు. గురువారం కేసీఆర్ గజ్వేల్‌లోని తన ఫామ్‌హౌస్ నుండి హైదరాబాద్‌కు చేరుకొని నేరుగా ఏఐజీ ఆసుపత్రిలో సాధారణ వైద్య పరీక్ష చేయించుకునేందుకు వచ్చినట్లు ఆయన వ్యక్తిగత సిబ్బంది వెల్లడించారు. ఆయనకు పలు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు రిపోర్టుల వచ్చాక కేసీఆర్ కండీషన్ పై క్లారిటీ ఇస్తామని తెలిపారు.
గతంలో కాలు జారిపడినప్పుడు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలోతుంటికి చికిత్స పొందారు. రెగ్యులర్ చెకప్ కూడా యశోదలోనే చేయించుకునే కేసీఆర్ ఇప్పుడు ఎలాంటి ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత, డిసెంబర్ 8, 2023న కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో గాయపడిన విషయం తెలిసిందే. ప్రమాదంలో ఆయన కాలికి గాయమై మోకాలి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. శస్త్రచికిత్స తర్వాత రెండు, మూడు నెలలు విశ్రాంతి తీసుకున్నారు.
అప్పటి నుండి కేసీఆర్ అప్పుడప్పుడు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభించారు. మార్చి 19న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రోజున కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఏప్రిల్ 27వ తేదీన వరంగల్‌లో జరగనున్న బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సన్నాహకంగా ఆయన తన ఫామ్‌హౌస్‌లో వివిధ జిల్లాల పార్టీ నాయకులతో వరుస సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ఆస్పత్రిలో ఉండటం ఆందోళన కలిగించే విషయం.