16-11-2025 12:37:20 AM
-రిజర్వేషన్లపై ధర్మ యుద్ధం చేస్తున్నాం
-బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్
-వరంగల్ కేయూలో బీసీల ధర్మపోరాట దీక్ష ముగింపు
మహబూబాబాద్ (వరంగల్), నవంబర్ 15 (విజయక్రాంతి): రిజర్వేషన్ల పేరుతో బీసీలను నమ్మించి మోసం చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై బీసీల తిరుగుబాటు తప్పదని బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా పాత పద్ధతిలో స్థానిక సంస్థల ఎన్నికలకకు వెళ్తే ఉద్యమం తప్పదన్నారు.
వరంగల్ నగరంలోని కాకతీయ యూనివర్సిటీలో జరిగిన బీసీల ధర్మ పోరాట దీక్ష ముగింపు కార్యక్రమానికి శనివారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించడానికి డిసెంబర్ 1వ నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ కావాలన్నారు.
ప్రధాని సమయం ఇవ్వకపోతే ఇండియా కూటమి తరపున పార్లమెంటు సమావేశాలను స్తంభింపచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బీసీ దీక్షలతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి పార్లమెంటులో బీసీ బిల్లు పై చర్చకు పెట్టీ రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ రిజర్వేషన్ల చట్టానికి ఆమోదం తెలపాలని, లేదంటే డిసెంబర్ మొదటి వారంలో వేలాదిమందితో పార్లమెంటును దిగ్బంధం చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ నెల 17న జరిగే క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని సీఎం రేవంత్ చెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. కేంద్రంపై పోరాడకుండా స్థానిక ఎన్నికలకు వెళ్తే బీసీలకు కాంగ్రెస్ దోషిగా మిగులుతుందన్నారు.
ఢిల్లీతో కాంగ్రెస్ పోరాడితే దేశంలోని బీసీల అండ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని, బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయకుండా తప్పించుకుంటున్న బిజెపిని బీసీల దోషిగా చేసే బాధ్యత బీసీ సమాజం తీసుకుంటుందన్నారు. బీజేపీ గత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చి ప్రతిపక్ష నాయకున్ని కూడా బీసీని చేయలేదని, బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నందునే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీలు బీజేపీకి డిపాజిట్ రాకుండా చేశారని చెప్పారు.
కేయూ బీసీల ధర్మ పోరాట దీక్ష ముగింపు సందర్భంగా బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ నాగరాజ్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన దీక్షలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ, బీసీ జేఏసీ నాయకులు వడ్లకొండ వేణుగోపాల్‌గౌడ్, ప్రోపేసర్. సంగాని మల్లేశ్వర్, ప్రొఫెసర్ చిర్ర రాజు, బోనగాని యాదగిరి, వరంగల్ శ్రీనివాస్, వరికుప్పల మధు భీమగాని యాదగిరి, మాదం పద్మజ దేవి, తమ్మేలా శోభరాణి, వేముల మహేందర్, డ్యాగాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.