16-11-2025 12:03:03 AM
-గెలిచి 24 గంటలు కాకముందే గూండాయిజమా?
-కాంగ్రెస్‌వి దిగజారుడు..చిల్లర రాజకీయాలు
-గుండాగిరికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి
-బీఆర్‌ఎస్ కార్యకర్తపై దాడికి కేటీఆర్ ఖండన
-అహంకారం ఎవరిదో, ఆత్మవిశ్వాసం ఎవరిదో ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్య
హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితా లు వెలువడి 24 గంటలు కాకముందే కాం గ్రెస్ పార్టీ గూండాగిరి, రౌడీయిజానికి దిగి, దిగజారుడు రాజకీయాలు చేస్తోందని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ డివిజన్‌లో కాంగ్రెస్ గుండాల దాడిలో గాయప డిన బీఆర్‌ఎస్ కార్యకర్త రాకేష్ క్రిస్టోఫర్ నివాసానికి శనివారం కేటీఆర్ వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ... తమ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ పోటీ చేసిన ఈ ఎన్నికల్లో, అధికార పార్టీ చేసిన అరాచకాలు, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని చేసిన దుర్మార్గాలు, ఎలక్షన్ కమిషన్ కూడా చేష్టలు ఉడిగి చూసిన వైనం ఫలితంగానే తాము సాంకేతికంగా ఓడిపోయామని పేర్కొన్నారు. ‘పదేళ్లు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు.
ఎప్పుడైనా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు హద్దులు దాటి రాకేష్ క్రిస్టోఫర్‌పై జరిగిన దాడిలా ప్రవర్తించారా?. ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన వెంటనే, నిన్న మీ వాళ్లు మా పార్టీ గుర్తెన కారును ఊరేగింపు చేస్తూ, అవహేళన చేస్తూ చిల్లరగా ప్రవర్తించారు. గతంలో ఏడు ఉప ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచినప్పుడు మేము ఎప్పుడైనా ఇలా ప్రవర్తిం చామా?. అహంకారం ఎవరిదో, ఆత్మవిశ్వాసం ఎవరిదో తెలంగాణ ప్రజలే నిర్ణయి స్తారు.
ఒక ఎన్నికల్లో గెలుపుతోనే ఇంత మిడిసిపడితే, గతంలో పదేళ్ల పాటు అప్రతిహతంగా అన్ని ఎన్నికలు గెలిచిన మేము ఎలా ప్రవర్తించి ఉండాలో ఆలోచించుకోవాలని’ కాంగ్రెస్ పార్టీ చర్యలను ఖండిస్తూ సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. ఒక క్రిస్టియన్ మైనారిటీ సోదరుడి మీద జరిగిన ఈ దాడిని తాను పూర్తిగా ఖండిస్తు న్నానని, ఈ దాడికి కచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే, సీఎం రేవంత్ రెడ్డియే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ రకంగా కక్షపూరితంగా రౌడీయిజం చేస్తామంటే తెలంగాణ ప్రజలు చూ స్తున్నారని, తగిన సందర్భంలో తగిన విధం గా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. విష్ణువర్ధన్ రెడ్డి, సునీత, కౌశిక్ రెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్లు సహా నాయకులందరం కలిసి రాకేష్ క్రిస్టోఫర్ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి వచ్చామని వెల్లడించారు.
‘జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి ఏం జరిగినా, కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది, పార్టీ ది. వదిలిపెట్టే సమస్య లేదు. ఎక్కడ ఎవరికి ఏ చిన్న నొప్పి కలిగినా తప్పకుండా ఇదే రకంగా వారి ఇంటి ముందుకు వస్తాం’ కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఇన్ని రిగ్గింగ్‌లు, గూండాగిరి, దొంగ ఓట్లు, పైసలు, చీరలు, కుక్కర్లు పంచినా కూడా తమ అభ్యర్థికి 75,000 ఓట్లు వచ్చాయని, ఇది స్వల్ప సంఖ్య కాదన్నారు. కాంగ్రెస్ నాయకులు సంయమనంతో వ్యవహరించకపోతే, బుద్ధి చెప్పే విధంగా ప్రజల్ని చైతన్యం చేస్తామని స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్‌లో ఎందుకు ఓడిపోయాం?
-ఉప ఎన్నిక ఓటమిపై మాజీ సీఎం కేసీఆర్ ఆరా
-ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేటీఆర్‌తో భేటీ
-భవిష్యత్ కార్యాచరణపై చర్చ
హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్ ఓటమి, అందుకు గల కారణాలపై కేసీఆర్ ఆరా తీసినట్టు సమాచారం. మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం, పోలింగ్ సరళి, ఓటమి తర్వాత పరిస్థితులపై ఈ సందర్భంగా కేసీఆర్‌కు కేటీఆర్ వివరించినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేసినట్టు సమాచారం. అందులో భాగంగా జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ కార్యకర్తలతో మంగళవారం(నవంబర్ 18) తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమావేశమై జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటమికి గల కారణాలపై చర్చించనున్నారు. ఇక రాబోయే రోజుల్లో రాష్ర్టంలోని అన్ని జిల్లాల్లోనూ దశల వారీగా పర్యటించనున్నట్లు కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే జూబ్లీహిల్స్ ఓటమి తర్వాత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తాజాగా కేటీఆర్, హరీష్ రావులపై విమర్శలు చేయడం ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలో కవిత చేసిన విమర్శలను కూడా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, వాటిపై కూడా కేటీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. కవిత చేసిన విమర్శలపై ఇంతవరకూ కేటీఆర్, హరీష్ రావు స్పందించలేదు.