05-11-2025 07:55:34 PM
ఖమ్మం టౌన్ (విజయక్రాంతి): కార్తీక పౌర్ణమి అవడంతో బుధవారం ఖమ్మంలోని దేవాలయాలు భక్తులతో నిండిపోయాయి. ఖమ్మంలోని శివాలయాల్లో హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు ఒత్తులు వెలిగించారు. ముఖ్యంగా మహిళా భక్తులు స్వయంగా ఒత్తులను తయారు చేసుకొని కార్తీక పౌర్ణమి రోజు ఇష్ట దేవాలయంలో ఒత్తులు వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు వేకువజామున కొందరు దేవాలయాల్లో వత్తులు వెలిగించగా మరికొందరు ఉదయం నుంచి ఉపవాసం వుండి సాయంత్రం దేవాలయాల్లో ఒత్తులు వెలిగించారు. తమ తమ ఇష్ట దైవాలను తలుచుకుంటూ ఒత్తులను వెలిగించి స్వామి వారులను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఖమ్మంలోని రోటరీ నగర్ లోని పరమేశ్వర రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో, గాంధీ చౌక్ లోని గుంటు మల్లేశ్వర స్వామి ఆలయం, ఖిల్లా సమీపంలోని శివాలయంలో, కోయచిలక మార్గంలోని శివాలయంతో పాటు ఖమ్మం లోని అన్నీ శివాలయాలు, పర్ణశాల రామాలయం, ఖానాపురం స్వయంబు వెంకటేశ్వర స్వామి ఆలయం, మధురానగర్ లోని భువనేశ్వరి అమ్మవారు, కృష్ణ, సాయిబాబా ఆలయం, లాకారం వద్దగల జల ఆంజనేయస్వామి ఆలయంలో, గుట్టమీద గల లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు ఖమ్మంలోని ఆలయాలు భక్తులతో కిక్కిరి సాయి. దేవాలయాల వద్ద ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహించారు.