calender_icon.png 5 November, 2025 | 9:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మారణాయుధాలతో ముగ్గురిపై బంధువుల దాడి

05-11-2025 08:00:58 PM

ఘటనకు దారి తీసిన వివాహేతర సంబంధం..

ముగ్గురు పరిస్థితి విషమం హైదరాబాద్ తరలింపు..

కల్వకుర్తి: అల్లుడు విహాహేతర సంబంధం పెట్టుకొని మరో అమ్మాయితో వెళ్లిపోవడంతో పెద్దల పంచాయతీ పెట్టుకొని ఇరువురు మారణాయుధాలతో దాడి చేసుకున్న సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పురపాలక పరిధిలోని సంజాపూర్ లో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వెల్దండ మండలం చెరుకూరు గ్రామానికి చెందిన యువతిని పురపాలిక పరిధిలోని సంజాపూర్ కు చెందిన మల్లేష్ కు ఇచ్చి రెండు సంవత్సరాల క్రితం వివాహం చేశారు. అతనికి పెళ్లికి ముందే మరో మహిళతో వివాహేతర సంబంధం ఉండటంతో ఇంట్లో తరచూగా గొడవలు జరిగేవి. ఈ విషయం పెద్దలకు తెలియడంతో మందలించి వదిలేశారు.

అయినపట్టికీ అతనిలో మార్పు రాలేదు. కొన్ని రోజుల క్రితం వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో కలిసి ఇంటి నుండి వెళ్లిపోయాడు. దీంతో ఆగ్రహించిన మల్లేష్ అత్తగారి కుటుంబ సభ్యులు బుధవారం బంధువులతో కలిసి సంజాపూర్ కు వచ్చారు. వ్యవసాయ పొలం వద్ద ఉన్న మల్లేష్ తండ్రి జంగయ్య, తల్లి అలివేలు, తమ్ముడు పరమేశులతో మాట్లాడారు. ఇరువురి మధ్య మాటమాట పెరగడంతో మల్లేష్ అత్తగారి కుటుంబ సభ్యులు తమ వద్ద ఉన్న ఆయుధాలతో ముగ్గురిపై దాడి చేశారు. గొడవను గమనించిన సమీప పొలాల రైతులు ఇరువురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దాడికి పాల్పడిన వారిని అక్కడే బంధించి పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స నిర్వహించి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.