భూమి ఇవ్వకుంటే చంపేయండి!

10-05-2024 01:48:22 AM

ఆర్మీ అధికారులకు సౌదీ అరేబియా ఆదేశాలు 

నియోమ్‌కు అడ్డుపడొద్దని పౌరులకు హెచ్చరిక 

సౌదీ అరేబియా, మే 9 (విజయక్రాంతి) : తమ డ్రీమ్ ప్రాజెక్టు నియోమ్‌కు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా ఆదేశాలు జారీ చేసింది. దీని నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు సహకరించని వారిని ప్రాణాలతో విడిచిపెట్టొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని ఆ దేశ దళాల్లో పనిచేసిన కల్నల్ రభిహ్ ఎలెన్జీ మీడియాకు వెల్ల్లడించారు. నియోమ్ స్మార్ట్ సిటీ నిర్మాణం విషయంలో సౌదీ పాలకులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో చెప్పుకొచ్చారు.

కాగా, ఇటీవలి కాలంలో సౌదీ అరేబియాకు ప్రధాన ఆదాయ వనరులైన పెట్రోల్ నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రపంచం కూడా చమురు నుంచి గ్రీన్ ఎనర్జీ వైపు వేగంగా మళ్లుతోంది. దీంతో ఆదాయానికి గండిపడే అవకాశాలున్నాయని ఆ దేశం భావిస్తోంది. అందుకే, ఆదాయం పెంచుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే దేశాన్ని పర్యాటక ప్రదేశం, గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా నియోమ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు చేపట్టింది. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ దీన్ని తన డ్రీమ్ ప్రాజెక్టుగా భావిస్తున్నారు. 

500 బిలియన్ డాలర్లతో.. 

ఈ ప్రాజెక్టుకు 500 బిలియన్ డాలర్ల బడ్జెట్‌ను కేటాయించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఎర్ర సముద్ర తీరంలో మొత్తం 26,500 చదరపు కిలోమీటర్ల పరిధిలో 10 రకాల రీజియన్లను నిర్మించనున్నారు. 2030 నాటికి ఇక్కడి జనాభా 20 లక్షలకు చేరుకోవచ్చని అంచనా. ఇక ది లైన్ ప్రాజెక్టును 100 మీటర్ల ఎత్తులో 200 మీటర్ల వెడల్పుతో 170 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు. ఇందులో దాదాపు 90 లక్షల మంది నివసించవచ్చని చెబుతున్నారు. ఈ నగరంలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.

వాస్తవానికి నియోమ్ ప్రాజెక్టు నిర్మాణం 2030 నాటికి 2.4 కిలోమీటర్ల మేరకే పూర్తవుతుందనే అంచనాలున్నాయి. భూ సేకరణ కోసం మూడు గ్రామాలను ఖాళీ చేయించారు. ప్రాజెక్టు ప్రారంభంలో అబ్దుల్ రహీం అల్ హువైటీ అనే వ్యక్తి తన భూమిలోకి అధికారులను రానీయకుండా భూసేకరణను అడ్డుకున్నాడు. దీంతో అతడిని మర్నా డే దళాలు కాల్చేశాయి. అనంతరం భారీ ఎత్తున ఆందోళనలు చెలరేగా యి. ఆందోళనలను చేపట్టిన వారిలో 47 మందిపై ఉగ్రనేరాలు మోపి అరెస్టు చేశారు. ఇకపై, ఈ ప్రాజెక్టుకు ఎవ్వరు అడ్డుపడినా చంపేస్తామని భద్రతా దళాలు హెచ్చరించాయి.