10-05-2024 01:59:26 AM
నిధుల పంపిణీకి హైకోర్టు అనుమతి
ఈసీ ఉత్తర్వులపై స్టే విధించిన న్యాయస్థానం
అమరావతి, మే 9 (విజయక్రాంతి): రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, చేయూత, విద్యా దీవెన, వైఎస్సార్ ఆసరా, ఈబీసీ నేస్తం తదితర పథకాల్లో లబ్ధిదారులకు నిధుల పంపిణీ చేసేందుకు అనుమతించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకాలకు సంబంధించి రూ.14,165 కోట్ల పంపిణీకి నిరాకరిస్తూ ఈసీ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నిధులను శుక్రవారం జమ చేసేందుకు వీలు కల్పిస్తూ జస్టిస్ బి కృష్ణమోహన్ గురువారం తీర్పునిచ్చారు. నిధుల పంపిణీలో రాజకీయ నేతల ప్రమేయం, ఆర్భాటాలు ఉండకూడదని షరతులు విధించారు. ఏ విధమైన ప్రచారం చేయడానికి వీల్లేదన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు సంక్షేమ పథకాలను అమలు చేయొద్దని రాష్ట్రాన్ని గతంలో ఈసీ ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారించిన హైకోర్టు పైఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 27కి వాయిదా వేసింది. ఈలోగా ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయాలని చెప్పింది.