24-05-2025 09:23:34 AM
ముషీరాబాద్,(విజయక్రాంతి): వేగవంతమైన అభివృద్ధి దిశలో ముందుకు సాగుతున్న విశ్వనగరం హైదరాబాద్ అని, ప్రపంచదృష్టిని ఆకర్షిస్తుందని, 70 శాతం రాష్ర్టానికి రెవెన్యూ తీసుకువస్తున్న నగరంలోని పలు కాలనీలు, బస్తీలు, వాడల్లోని మౌలిక సదుపాయాల కల్పనకు జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం శోచనీయమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గాంధీనగర్ డివిజన్ లో రూ.1.29 కోట్ల వ్యయంతో వాటర్ వర్క్స్ పనులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్, గాంధీనగర్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ లతో కలిసి భూమి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... భాగ్యనగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే, కార్పొరేటర్ లేనందున నగర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. కార్పొరేటర్లకూ సైతం నిధులు కేటాయించడం లేదన్నారు. దీంతో అభివృద్ధి పనుల్లో వేగం మందగిస్తుందని చెప్పారు. అందాల పోటీలతోనే నగరం అభివృద్ధి జరగదన్నారు. బస్తీల్లో, కాలనీల్లో, స్లమ్స్ లో మౌలిక సదుపాయాల కల్పనలో వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వీధి లైట్లు, ప్లే గ్రౌండ్ లు, రోడ్ల మరమ్మత్తులు, మౌలిక సదుపాయాల కల్పన కోసం వెంటనే సీఎం రేవంత్ రెడ్డి నిధులను పెద్ద ఎత్తున కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గతంలో వీధిలైట్లను ఒకటి, రెండు రోజుల్లోనే మార్చేవారని చెప్పారు.
ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. గాంధీనగర్ డివిజన్ లో వీధిలైట్ల ఏర్పాటుకు నిధులు లేవని అధికారులు చేతులెత్తేస్తున్నారని చెప్పారు. ప్రపంచదృష్టిని ఆకర్షిస్తున్న నగర ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత జీహెచ్ ఎంసీ, వాటర్ వర్క్స్, రాష్ర్ట ప్రభుత్వంపై ఉందని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, ముషీరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి ఎం. రమేష్ రామ్, ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు, ముషీరాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే పూసరాజు, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, బీఆర్ఎస్ యువజన నాయకుడు ముఠా జై సింహ, బిజెపి నేతలు ఆనంద్ కుమార్, వివిధ శాఖల అధికారులు, బిజెపి, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.