24-05-2025 01:41:27 PM
-ఉచిత కంప్యూటర్ శిక్షణను ప్రారంభించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్నగర్,(విజయక్రాంతి) : కంప్యూటర్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆర్పిలు సభ్యుల వివరాలు ఒక క్లిక్ చేస్తే పూర్తి సమాచారం మీ కళ్ళముందు క్షణాలలో ఉంటుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మెప్మా భవనం ( నగరపాలక సంస్థ కార్యాలయం) లో ఆర్పీలకు ఉచితంగా అందిస్తున్న కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో కంప్యూటర్ ద్వారా వచ్చేందుకు ఈ కంప్యూటర్ శిక్షణ ఆర్పి లకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు కార్యక్రమం లో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. , కొన్ని రాష్ట్రాల్లో మహిళా సంఘాల వివరాలు కంప్యూటరీకరణ చేస్తున్నారని, భవిష్యత్తు లో మన దగ్గర కూడా ఆ అవకాశం వస్తే ఆర్పీలు వెనుకబడే అవకాశం ఉంటుందని, అప్పుడు నేర్చుకొని మహిళా సంఘాల డేటాను క్రోడీకరించి, కంప్యూటర్ లో నిక్షిప్తం చేయాల్సి వస్తే ఆర్పీలు ఇబ్బందులు పడుతారని అందుకే ముందుచూపుతో ఆర్పీలకు కంప్యూటర్ శిక్షణ ఇప్పిస్తున్నామని, వారు ఈ శిక్షణ పూర్తి చేసుకుంటే మహిళా సంఘాల పద్దులు, వారి వివరాలు, మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న అప్పు వివరాలు, చెల్లింపులు తదితర సమాచారం ఒకేఒక్క క్లిక్ తో ఒకే చోట తెలుసుకునే అవకాశం ఉంటుందని, కంప్యూటరీకరణ వలన ఎలాంటి అవకతవకలు చోటు లేకుండా, పూర్తి పారదర్శకంగా మహిళా సంఘాల కార్యకలాపాలు జరుగుతాయని ఆయన చెప్పారు.
ఈ అవకాశాన్ని ఆర్పీలు ఉపయోగించుకుని, కంప్యూటర్ పైన పూర్తిగా పట్టు సాధించి మహిళలు దేనిలోను తక్కువ కాదు అని ప్రపంచానికి చాటిలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, టి పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, అజ్మత్ అలి, మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు పర్యవేక్షకులు గుండా మనోహర్, నాయకులు రామచంద్రయ్య, లీడర్ రఘు, జహీర్, ప్రవీణ్ కుమార్, అక్బర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు నగరపాలక సంస్థ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.