calender_icon.png 12 December, 2025 | 10:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హక్కులు తెలుసుకొని బాధ్యతగా మెలగాలి

11-12-2025 01:07:17 AM

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఇందిర

మహబూబ్ నగర్ టౌన్, డిసెంబర్ 10 : రాజ్యాంగం కల్పించిన మానవ హక్కులను తెలుసుకొని సమాజంలో బాధ్యతగా మెలగాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర అన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా జైలులో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. సమాజంలో మనిషికి రాజ్యాంగం కొన్ని హక్కులను కల్పించిందని వాటిని మంచి పనులకు ఉపయోగించేలా కృషి చేయాలన్నారు.

హక్కుల ఉల్లంఘన కు పాల్పడితే నేరమవుతుందని, బాధ్యతను మరిచి ఎవరు ప్రవర్తించవద్దని సూచించారు. నేర ఆరోపణలతో జైలుకు వచ్చి స్వేచ్ఛ హక్కును కోల్పోతున్నారని సూచించారు. ఇక్కడ శిక్షణ కాలంలో సత్ప్రవర్తనతో మెలిగి బయటికి వెళ్లాక తప్పులు చేయకుండా బాధ్యతగా మెలగాలని సూచించారు. తప్పు చేసిన మనిషికి జైలు అనేది మారడానికి ఒక అవకాశం గా భావించాలని సూచించారు.

తమపై ఆధారపడిన కుటుంబాలు, తల్లిదండ్రుల బాధ్యతలను గుర్తుచేసుకొని సమాజంలో గౌరవంగా బతికేలా మారాలని అన్నారు. ఖైదీల సంక్షేమం విషయంలో ఇబ్బంది జరిగితే వెంటనే జైలు అధికారులకు తెలపాలని అన్నారు. జైల్లో శిక్షణ కాలంలో సత్ప్రవర్తనతో మెలిగి ఆసక్తి కలిగిన రంగంలో నైపుణ్యం సాధించి ఉపాధి పొందేలా తయారు కావాలని సూచించారు.

మానవ హక్కులకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ ఏ.వెంకటేశం, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ రవీందర్ నాయక్, న్యాయవాదులు టి.కృష్ణ, యోగేశ్వర్ రాజ్, కార్తీక్, మల్లారెడ్డి, శివరాజ్, పిఎల్వి యాదయ్య తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఏనుగొండ జిల్లా పరిషత్ హై స్కూల్ లో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.