calender_icon.png 27 July, 2025 | 7:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేనేత వస్త్రాల అడ్డా కొత్తకోట

27-07-2025 01:30:00 AM

వనపర్తి జిల్లాలోని అమరచింతతోపాటు కొత్తకోట చేనేత వస్త్రాలకు ఓ ప్రత్యేకత ఉంది. కొత్తకోటలో నేసిన వస్త్రాలు పలువురిని మెప్పిస్తున్నాయి. విభిన్న రంగులు, సంక్లిష్టతో కూడిన ఈ కొత్తకోట చీరలు మహిళల మనసును దోచుకుని ప్రశంసలను అందుకుంటున్నాయి. ఈ చీరలు ఇక్కడి సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని చాటుతున్నాయి. ఈ చీరల అల్లిక చాలా సంక్లిష్టంగా ఉండటంతో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.

ఈ చీరలు విలక్షణమైన జరీ వర్క్, క్లిష్టమైన కుట్టు బార్డర్లకు ప్రసిద్ధి పొందాయి. ఇక్కడి పట్టు చీరలు వివిధ రంగులు, ప్రత్యేకమైన పల్లు మోడల్స్‌లలో చేతితో నేయబడుతాయి. చీరలు కాటన్ వార్ప్, సిల్క్‌వెఫ్ట్‌ను కలిసి ఉంటాయి. ఈ డిజైన్లలో స్థానిక వృక్షాలు, జంతువులు, గుడుల నిర్మాణం, రేఖాగణిత నమూనాలను వాడుతారు. షిరిడీ సాయిబాబాకు ప్రతి ఏటా గురుపౌర్ణమి రోజున  కొత్తకోట చేనేత కార్మికులు స్వయంగా నేసిన పట్టు వస్త్రాలను  సమర్పిస్తారు. 

వనపర్తి సంస్థానాధీశులు 18వ శతాబ్దంలో కొత్తకోట చీరల తయారీకి అంకురార్పాణ చేశారు. తమ కాలపు సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా మగువల మనసు దోచేలా విభిన్నమైన చీరలను తయారు చేయాలని నేతన్నలను ప్రోత్సహించారు. దీంతో ఆ ప్రాంత సహజ పరిసరాలు, వాస్తు శిల్పాలను ఆధారంగా చేసుకొని  కొత్త డిజైన్లను రూపొందించారు. నాటి పాలకుల ప్రోత్సాహంతో 19వ శతాబ్దం నాటికి చేనేత వస్త్రాలకు, చీరలకు కొత్తకోట  ప్రధాన కేంద్రంగా మారింది. నాటి నుంచి ఇప్పటివరకు చీరలకు ప్రత్యేక కేంద్రంగా కొత్తకోట విరాజిల్లుతూ వస్తోంది.

చీరల డిజైన్లు

కొత్తకోట చీరలను చూడగానే తెలంగాణ సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవితాలు గుర్తుకు వస్తాయి. చీరలపై తామర పువ్వులు, నెమలి వంటి పక్షులు, ఆలయ నిర్మాణాన్ని గుర్తుకు తెచ్చే రేఖాగణిత నమూనాలు(వాస్తు శిల్పాలు) తదితర డిజైన్లు కనిపిస్తాయి. ఈ డిజైన్లు జీవితంలోని లోతైన అర్థాలను వివరిస్తాయి. తామర పువ్వు స్వచ్ఛత, దైవిక అందాలను సూచిస్తుంది. నెమలి పక్షి దయను, అందానికి ప్రతిరూపంగా నిలుస్తోంది. అంతేకాక ఇక్కడి చీరలు కలంకారి, పోచంపల్లి ఇక్కత్ రకాలను ఆధారంగా చేసుకొని ప్రత్యేక డిజైన్లను కలిగి ఉంటాయి. ఈ రకాలను చూడగానే ఇవి కొత్తకోటలోనే తయారయినవని సులువుగానే చెప్పవచ్చు. తెలంగాణ వారసత్వానికి ప్రతీకగా కొత్తకోట చీరలు నిలుస్తున్నాయి. 

ఇంటర్ లాకింగ్ వెఫ్ట టెక్నిక్

కొత్తకోట నేతలో ‘ఇంటర్ లాకింగ్ వెఫ్ట్’ అనే టెక్నిక్‌ను ఉపయోగిస్తారు. వివిధ రకాల నమూనాలు దారంలో, వస్త్రంలో సులువుగా కలిసిపోయేలా ఈ టెక్నిక్ పని చేస్తుంది. సాధారణంగా ఒక కొత్తకోట చీరలో దాదాపు 6,000 వరకు దారాలు ఉంటాయి. కొత్తకోట చీరల అంచులు వెడల్పుగా ఉండి విభిన్న రంగులను కలిగి ఉండడం వీటి ప్రత్యేక లక్షణం. చీర అంచులు మందమైన పట్టు దారంతో నేయడంతో  ఇవి చీరకు బరువు, నాణ్యతను అందిస్తాయి. అంతేకాక కొత్తకోట చీరల అంచులు ఆలయ నమూనాలను కలిగి ఉంటాయి. 

చీర నేయడానికి 15 రోజులు

ఇక్కడ మొత్తం 43 కుటుంబాలు చేనేతపై జీవనం సాగిస్తున్నాయి. ఒక్కో చీరకు ఒక్కో రేటు ఉంటుంది. ఒక చీర వేయడానికి 15 రోజులు పడుతుంది. మార్కెట్లో  దీని ధర రూ. 30 నుండి రూ.35 వేలు పలుకుతోంది. డిజైన్లలో కూడిన పట్టుచీర ఇంతకన్నా ఎక్కువ ధర కలిగి ఉంటది. రోజూ ధరించే చీరలను వారాకొక చీర తయారు చేసి ఇస్తారు. ప్రతిరోజు మగ్గం మీదనే సుమారు 7 గంటలు కూర్చుని పనిచేస్తుంటారు. వాళ్లే కలర్స్ వేసుకొని దారం చుట్టుకొని పని మొదలు పెడతారు. 

చీరను బట్టి ధర  

చేనేత కార్మికులు వేసే చీరలు చీరను బట్టి ఖరీదు ఉంటుంది. మామూలు చీరకు ఒక ధర, జరీ చీరలకు ఒక ధర ఉంటుంది. పట్టుచీరలలో కూడా చాలా రకాలు ఉంటాయి. అనేక రకాల డిజైన్లు కూడా ధర ఉంటుంది. పట్టు చీరలకు ప్రత్యేకమైన ఆకర్షణ నిలిచేందుకు మంచి డిజైన్లు కూడిన చీరలు నేస్తారు.

చేనేత మాఫీ ఎప్పుడు

చేనేత కార్మికులకు ప్రభుత్వాలు అండగా నిలిస్తే వారు మరింత ఉత్సాహంగా సరికొత్త డిజైన్లలో సుందరి మనలను ఆకర్షించే వెసులుబాటు కలుగుతుంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ  హయాంలో చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తామని చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రుణమాఫీ చేస్తానని అంటుంది తప్ప చేయలేదు. తమను ప్రభుత్వం ఆదుకుంటేచీరల్లో నూతన టెక్నాలజీ వాడి కొత్త కొత్త డిజైన్లను రూపొందిస్తామని చెబుతున్నారు. 

ప్రభుత్వాలు ఆదుకోవాలి 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులను ఆదుకోవాలి, గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని చెప్పింది.. కానీ చేయలేకపోయింది. ఈ ప్రభుత్వమైనా రుణమాఫీ  ఎప్పుడు చేస్తాదో తెలియని పరిస్థితి. ప్రభుత్వం వస్త్రాలు కొనుగోలు చేస్తే కార్మికులకు గిట్టుబాటు ఉంటుంది. గతంలో టెస్కో ద్వారా కొనుగోలు చేసేది. టెస్కో ద్వారా చేనేత కార్మికుల ద్వారా కొనుగోలు చేసి చేయూతను అందించాలి. త్రిఫ్ట్ పన్ను పథకం ద్వారా కార్మికుడు నెలకు వెయ్యి రూపాయలు జమ చేస్తే ప్రభుత్వం కూడా నెలకు వెయ్యి జమ చేసి 3 ఏండ్లకు మొత్తం ఇస్తుంది. 

 సాక బాలనారాయణ, చేనేత కార్మికుల రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు 

మా పనికి తగిన గుర్తింపు లేదు 

పొద్దున లేచి రాత్రి వరకు ఇదే పనిలో నిమగ్నం అయి పట్టువస్త్రాలకు జీవం పోస్తున్నాం. అయినా కూడా మాకు సరైన గుర్తింపు లేదు. తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాం. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా బతుకులు మారడం లేదు. రుణమాఫీ చేస్తా అంటుంది కానీ చెయ్యడం లేదు. ఒక చీరను నేయాలంటే 10 నుండి 15 రోజులు పడుతుంది. దారాలకు రంగులు వేసుకోవాలి, అరబెట్టువడం చాలా కష్టం ఉంది. ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని ఆదుకోవాలి.   

 పద్మ, చేనేత కార్మికురాలు, కొత్తకోట