27-07-2025 12:00:00 AM
నాదెళ్ల.. మనోడేనుళ్లా
సత్యనాదెళ్ల ఈ పేరు తెలియని యువత ఎవరూ ప్రపంచంలో ఉండరనేది అతిశయోక్తి కాదు. మైక్రోసాఫ్ట్ సీఈవోగా తనదైన ముద్ర చూపిస్తున్న సత్యనాదెళ్ల.. మన హైదరాబాద్ గడ్డ మీదే జన్మించాడు. నగరంలోని ప్రఖ్యాత బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఓనమాలు దిద్దిన సత్య అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడే విధంగా మైక్రోసాఫ్ట్ పగ్గాలు అందుకున్నారు.
సన్ మైక్రోసిస్టమ్స్‌లో కెరీర్ ప్రారంభించిన నాదెళ్ల 2014 నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవోగా కొనసాగుతున్నారు. వేరే దేశం నుంచి వచ్చి అమెరికా గడ్డపైన స్థిరపడ్డ బిలియనీర్ల జాబితాలో సత్యనాదెళ్ల చోటు దక్కించుకోవడం గమనార్హం.
కలవరపెడుతున్న ఉపేంద్ర ద్వివేది
భారత సైన్యానికి 30వ కమాండర్‌గా కొనసాగుతున్న జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్థాన్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. నేవీ చీఫ్‌గా కొనసాగుతున్న అడ్మిరల్ దినేశ్ త్రిపాఠీ, ద్వివేది చిన్ననాటి స్నేహితులు. మధ్యప్రదేశ్‌లో జన్మించిన ఉపేంద్ర అచంచలదీక్షతో భారత సైన్యంలో ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేసిన ద్వివేది అనేక అవార్డులు, రివార్డులు కూడా సొంతం చేసుకున్నారు. భారత సైన్యాన్ని శత్రుదుర్భేద్యంగా మార్చేందుకు అహోరాత్రులు కృషి చేస్తూ శత్రుదేశాలకు కాళరాత్రులు మిగులుస్తున్నాడు.