calender_icon.png 21 January, 2026 | 3:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలంపూర్ ఎమ్మెల్యేపై దాడి.. స్పందించిన కేటీఆర్

21-01-2026 02:43:52 PM

హైదరాబాద్: అలంపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు విజయుడుపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి చేసిన వాగ్వివాదం, శారీరక దాడిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బుధవారం తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్య విలువలపై జరిగిన దాడి అని ఆయన అభివర్ణించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి కాంగ్రెస్ అనుసరిస్తున్న బెదిరింపు రాజకీయాలను ఈ ఘటన బట్టబయలు చేసిందన్నారు.

ఎన్నికైన ఎమ్మెల్యేపై దాడి చేయడం కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగంపై, చట్టబద్ధమైన పాలనపై ఉన్న అగౌరవాన్ని చూపిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రతిపక్షాన్ని బెదిరింపుల ద్వారా కాకుండా రాజకీయంగానే ఎదుర్కోవాలని, తమ నాయకులపై జరిగే దాడుల విషయంలో బీఆర్ఎస్ మౌనంగా ఉండబోదని కేటీఆర్ హెచ్చరించారు.

మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డెపల్లి మండలం పైపాడు గ్రామంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రోటోకాల్ విషయంలో వివాదం చెలరేగి, ఎంపీ మల్లు రవికి, ఎమ్మెల్యే విజయుడుకి మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యేపై ఎంపీ సీరియస్ అయిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రోటోకాల్ గురించి ప్రశ్నించినందుకు ఎంపీ ఆ ఎమ్మెల్యేను దూషించి, నెట్టివేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇద్దరు నాయకులను, వారి అనుచరులను చెదరగొట్టారు.