21-01-2026 03:13:43 PM
- రహదారి భద్రత అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించే ప్రయాణికులంతా రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటించి సురక్షితంగా తమ ఇంటికి చేరుకోవాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి అన్నారు. బుధవారం జాతీయ రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా విద్యార్థులతో పబ్లిక్ అవేర్నెస్ ర్యాలీ నిర్వహించారు.
రహదారి ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే కుచ్చుకుల్ల రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్, రోడ్డు రవాణా శాఖ ఇంచార్జి అధికారి బాలు నాయక్, వైద్య ఆరోగ్య శాఖ ఇంచార్జ్ అధికారి రవికుమార్, డిఎస్పి బుర్రి శ్రీనివాసులు తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన వేదికపై వారు మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్, సీటుబెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. విద్యార్థులు రహదారి భద్రతకు సంబంధించిన ప్లకార్డులు, నినాదాలతో ప్రజలను చైతన్యపరిచారు.