calender_icon.png 10 September, 2025 | 8:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయాల్లో సురవరం కీలక పాత్ర: శాసనమండలి చైర్మన్ గుత్తా

10-09-2025 05:15:25 PM

సురవరం అజాతశత్రువు: మంత్రి కోమటిరెడ్డి 

నల్లగొండలో ఘనంగా సురవరం సంస్మరణ సభ 

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ పేదల జీవితాలలో మార్పు రావాలని, వారి కోసం నిరంతరం శ్రమించిన గొప్ప నాయకుడు సురవరం సుధాకర్‌ రెడ్డి అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Legislative Council Chairman Gutha Sukender Reddy) అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జి ఎల్ గార్డెన్ లో నిర్వహించిన ఆయన సంస్మరణ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తను నమ్మిన సిద్ధాంతాలను చివర వరకు ఆచరించిన అవిశ్రాంత యోధుడని కొనియాడారు. సమాజంలో అనాగరికాలు రూపుమాపేలా ఆయన ఎన్నో చైతన్య కార్యక్రమాలు చేపట్టారన్నారు. మొదటితరంలో సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామృకష్ణారావు ప్రజల కోసం పోరాడగా రెండో తరంలో జైపాల్‌ రెడ్డి సురవరం సుధాకర్‌ రెడ్డిలు రాజకీయాల్లో రాణించారు. సురవరం సుధాకర్‌రెడ్డి గుర్తింపు, ఆయన సిద్ధాంతాలు ప్రజలకు అర్థమయ్యేలా చేస్తామన్నారు.

రాష్ట్ర రోడ్డు భవనములు, సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkata Reddy) మాట్లాడుతూ, సురవరం సుధాకర్ రెడ్డి అజాతశత్రువు అని జాతీయ స్థాయికి ఎదిగిన గొప్ప నాయకుడన్నారు. ఆయన మృతదేహాన్ని గాంధీ ప్రభుత్వాసుపత్రికి  అప్పజెప్పడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఆయన మరణం కార్మిక కర్షక లోకానికి  తీరని లోటని తెలిపారు. నల్లగొండ జిల్లాలో సురవరం విగ్రహం ఏర్పాటుకు సహకారం అందించడంతో పాటు జిల్లా కేంద్రంలో ప్రభుత్వం చేపట్టపోయే పనుల కార్యక్రమానికి సురవరం సుధాకర్ రెడ్డి పేరు పెట్టడానికి ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. న్యాయం కోసం ప్రశ్నించే వారే నిజమైన కమ్యూనిస్టులని వారికి మరణం లేదన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని  సాంబశివరావు మాట్లాడుతూ, రెండు సార్లు ఎంపీగా విజయం సాధించినా సురవరం నిరాడంబరమైన జీవితాన్ని గడిపారన్నారు.

ధనిక కుటుంబంలో జన్మించిన సురవరం పేదల పక్షాన నిలిచిన వామపక్ష యోధుడని, ఆయన జీవన శైలి ఎంతో ఆదర్శమన్నారు. విద్యార్థి దశ నుంచే సురవరం సుధాకర్‌రెడ్డి ఉద్యమ బాట పట్టి అంచెలంచెలుగా ఎదిగి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో సురవరం అగ్రగణ్యుడని తెలిపారు. ఎంపీగా నల్లగొండ జిల్లాకు కృష్ణా జలాల తరలింపు ద్వారా ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించడానికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లి కంటి సత్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జూలకంటి రంగారెడ్డి, తుమ్మల వీరారెడ్డి, సిపిఐ నాయకులు ఉజ్జిని రత్నాకర్ రావు, మల్లెపల్లి ఆదిరెడ్డి, పల్లా దేవేందర్ రెడ్డి, శ్రావణ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.